Telugu Gateway
Politics

కొట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

కొట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు
X

సీటు కోసం కోట్లాట. అదేదో ఎంపీ, ఎమ్మెల్యే వంటి కీలకమైన సీటా అంటే అదీ కాదు. వేదికపై సీటు కోసం. ఈ కొట్లాటలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు కూడా భాగస్వామి కావటం విశేషం. కాంగ్రెస్ నేతల పైటింగ్ చూసి వేదిక మీద ఉన్న నేతలు కూడా నిర్ఘాంతపోయారు. అసలు కార్యక్రమం ఏంటి..కాంగ్రెస్ నేతల తీరు ఏంటి అంటూ నేతలు వాపోయారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ ధర్నా పార్కు వద్ద అఖిలపక్ష నేతలు నిర్వహించిన సమావేశం కాంగ్రెస్ నేతల ఫైటింగ్ తో కాస్త గందరగోళంగా మారింది. వేదిక మీద కుర్చీలో కూర్చునే విషయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హనుమంతరావు, ఆ పార్టీ అధికార ప్రతినిధి నగేశ్‌ మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు తోసుకొని.. కుర్చీలో కూర్చునేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీహెచ్‌, నగేశ్‌ వేదిక మీదే పరస్పరం బాహాబాహీకి దిగారు.

ఒకరిని ఒకరు తోసుకుంటూ కింద పడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనైన హనుమంతరావు నగేశ్‌పై చేయిచేసుకున్నారు. వేదిక మీదనే ఇద్దరు నేతలు తోపులాటకు, ఘర్షణకు దిగడంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. హనుమంతరావు తోసివేయడంతో నగేశ్‌ వేదిక మీదున్న కోదండరామ్‌పై పడబోయారు. దీంతో వేదిక మీద తీవ్ర గందరగోళం, రభస, ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తెలంగాణ జన సమితి నేత కోదండరామ్‌తోపాటు ఇతర నాయకులు ఈ పరిణామంతో షాక్‌ తిన్నారు. చనిపోయిన పిల్లల కుటుంబాలు ముందు ఇలా మనం కొట్టుకోవడం వారిని అవమానించడమేనని కోదండరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోదండరామ్‌తోపాటు చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కే, నారాయణ, టీడీపీ నేత ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసన దీక్షలో కాంగ్రెస్‌ నేతలు కుంతియా, షబ్బీర్ అలీ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Next Story
Share it