Telugu Gateway
Andhra Pradesh

టెండర్లపై న్యాయ విచారణ..చంద్రబాబుకు చిక్కులే

టెండర్లపై న్యాయ విచారణ..చంద్రబాబుకు చిక్కులే
X

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే గత ఐదేళ్ల పాలనలో చోటుచేసుకున్న టెండర్లలో అక్రమాలను సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించేందుకు జగన్ సిద్ధపడ్డారు. అంతే కాదు..కొత్త టెండర్లకు సంబంధించి మార్గదర్శకాలను కూడా జ్యుడిషియల్ కమిటీని కోరనున్నాయి. అయితే పరిపాలనాపరమైన అంశంమైన టెండర్లకు మార్గదర్శకాల విషయంలో జడ్జీల పాత్ర ఏ మేరకు ఉంటుందనే అంశంపై అధికారులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టెండర్లలో అక్రమాలను నిగ్గుతేల్చే విషయంలో మాత్రం అభ్యంతరాలు ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్ల దగ్గర నుంచి మొదలుపెడితే..సాగునీటి ప్రాజెక్టులు..అమరావతిలో కేటాయించిన ఏకంగా 50 వేల కోట్ల రూపాయల పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతే కాదు..పనులన్నీ కేవలం ఎంపిక చేసిన కొన్ని సంస్థలకు మాత్రమే దక్కాయి.

తాత్కాలిక సచివాయలం పనులు మొదలుకుని అమరావతిలో పనులన్నీ కేవలం ‘అప్పగింతల’ తరహాలోనే సాగాయి. అంతే కాదు..ఆ పనుల్లో అంచనా వ్యయాలను కూడా అడ్డగోలుగా పెంచారు. అమరావతిలో ఓ బ్రిడ్జికి సంబంధించిన పనుల కేటాయింపులోనే ఏకంగా 500 కోట్ల రూపాయల మేర వ్యయాన్ని అడ్డగోలుగా పెంచారు. ముఖ్యంగా అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎడీసీ)లో జరిగిన వ్యవహారం అంతా తవ్వటం మొదలుపెడితే కుంభకోణాలు బద్దలయ్యే అవకాశం కన్పిస్తోంది. అమరావతిలో పనులు అప్పగింత అంతా కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణ కనుసన్నల్లోనే సాగాయని సీఆర్ డీఏ వర్గాలు చెబుతున్నాయి. చివరకు రాజధాని ‘డిజైన్ల’ టెండర్ లోనూ కుంభకోణానికి పాల్పడ్డారు. వీటితోపాటు విద్యుత్ కొనుగోలు టెండర్ల వ్యవహారం ఎలాగూ ఉండనే ఉంది. పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు వద్దని వారించినా కూడా చంద్రబాబు అండ్ టీమ్ మంత్రివర్గంలో పెట్టుకుని మరీ అక్రమాల..అడ్డగోలు టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యవహారం చంద్రబాబుతోపాటు మంత్రివర్గం మెడకు చుట్టుకోతోంది.

Next Story
Share it