ఏపీ ఐఏఎస్ ల్లో టెన్షన్ టెన్షన్!
ఎవరి మెడకు ఏమి చుట్టుకుంటుంది?. ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన జ్యుడిషియల్ విచారణలో వెల్లడయ్యే అంశాలు ఏమిటి?. ఇందులో ఐఏఎస్ లు కూడా అడ్డంగా దొరుకుతారా?. దొరికితే ఎవరు ఉంటారు?. ఇదే టెన్షన్ ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారుల్లో వ్యక్తం అవుతోంది. ఈ గండం నుంచి బయటపడేందుకు గల మార్గాలను కూడా అన్వేషించుకునే పనిలో ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి వచ్చిన తొలినాళ్ళలో మాత్రం ఏది అడిగితే అది చేసేశారు. తర్వాతర్వాత ‘టెండర్ల’ కేటాయింపు వ్యవహారం మరీ ‘ఎంపిక’ పద్దతుల్లో సాగుతుండటంతో వాళ్ళలో కూడా టెన్షన్ మొదలైంది. కొంత మంది పూర్తిగా ప్రభుత్వం ఏమి చెపితే అది చేయగా..మరి కొంత మంది మాత్రం తెలివిగా ప్రతిదీ ఫైలులో రికార్డు చేశారు. ముఖ్యంగా ఎక్కువ శాతం టెండర్ల గోల్ మాల్ సాగునీటి శాఖతో పాటు అమరావతి నిర్మాణం, విద్యుత్ శాఖల్లోనే జరిగింది.
ప్రమాణ స్వీకార వేదికగా జగన్మోహన్ రెడ్డి టెండర్ల అక్రమాలను నిగ్గుతేలుస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే కొంత మంది ఐఏఎస్ ల్లో టెన్షన్ పెరుగుదలకు కారణమైంది. కొన్ని పనులను అయితే అధికారులు అభ్యంతరం వ్యక్తం చెప్పినా కేబినెట్ లో పెట్టుకుని మరీ ఓకే చేయించుకుంది చంద్రబాబు సర్కారు. గత ఐదేళ్ళకు సంబంధించిన ‘టెండర్ల’ గోల్ మాల్ తవ్వకం ప్రారంభం కానుంది. ఇందులో ఎన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాల్సిందే. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీపార్ధసారధిని అత్యంత కీలకమైన అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎడీసీ) సారధ్య బాధ్యతలు అప్పగించి టెండర్ల వ్యవహారం అంతా ఆమెకే అప్పగించారు. సీఆర్ డీఏతో పోలిస్తే ఆమె సారధ్యంలో జరిగిన టెండర్ల మొత్తమే చాలా ఎక్కువగా ఉంటుందని మౌలికసదుపాయాల శాఖ వర్గాలు తెలిపాయి.
రిటైర్డ్ అధికారి కావటంతో ఆమె చంద్రబాబు అండ్ టీమ్ ఏమి చెపితే అది చేశారని..ఏడీసీ ఫైళ్ళు పరిశీలిస్తే ‘అక్రమాల అనకొండలు’ బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ వ్యవహారాలు అన్నీ ఇఫ్పుడు కొంత మంది కీలక శాఖల ఐఏఎస్ ల్లో టెన్షన్ రేపుతున్నాయి. కొంత మంది ఐఏఎస్ లకు చెందిన అవినీతి..అక్రమాల వ్యవహారం చాలా రోజుల క్రితమే కేంద్రంలోనే మోడీ సర్కారుకు కూడా చేరింది. కేంద్రంలో తిరిగి మోడీ సర్కారు రావటంతో ఇప్పుడు వాళ్ళు కూడా చిక్కుల్లో పడటం ఖాయం అని చెబుతున్నారు. ఇందులో కొంత మంది ‘ముఖ్య’ అధికారులు కూడా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.