మమతా సర్కారుకు సుప్రీం వార్నింగ్
పశ్చిమ బెంగాల్ లోని మమతా సర్కారుకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. బీజేవైఎం కార్యకర్త ప్రియాంక శర్మను తక్షణమే విడుదల చేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పశ్చిమ బెంగాల్ సర్కార్‌ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. మమతా బెనర్జీపై వివాదాస్పద ఫోటోను ఫార్వర్డ్ చేసిన ప్రియాంక శర్మ అరెస్ట్ ఏకపక్షమని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆమెను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని, లేకుంటే తదుపరి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరికలు చేసింది.
ప్రియాంక శర్మను విడుదల చేయాలని మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మమతా సర్కార్ బేఖాతరు చేసింది. దీంతో ప్రియాంక బంధువులు మమతా బెనర్జీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మమతపై అభ్యంతరకర పోస్ట్ ను ఫార్వర్డ్ చేసినందుకు ప్రియాంశ శర్మ బేషరతుగా క్షమాపణలు చెప్పిన తర్వాతనే ఆమెను విడుదల చేస్తామని పశ్చిమ బెంగాల్ అధికారులు ప్రకటించారు. మరి తాజా సుప్రీం ఆదేశాలతో సర్కారు వైఖరి ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.