Telugu Gateway
Cinema

‘సీత’ మూవీ రివ్యూ

‘సీత’ మూవీ రివ్యూ
X

దర్శకుడు తేజ చాలా కాలం తర్వాత ‘నేనే రాజు..నేనే మంత్రి’తో హిట్ కొట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ ల దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. కానీ మధ్యలోనే వదిలేశారు. దీనికి గల కారణాలు ఏంటో స్పష్టంగా ఎవరికీ తెలియదు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే ‘సీత’. ఇందులో కథ అంతా సీత పాత్ర పోషించిన కాజల్ చుట్టూనే తిరుగుతుంది. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయన కూడా సరైన హిట్ కోసం గత కొంత కాలంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ హిట్ మాత్రం ఆయనకు మొహం చాటేస్తూనే ఉంది. ఇప్పుడు ‘సీత’ సినిమా విషయంలోనూ అదే జరిగిందని చెప్పొచ్చు. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే సీత వేల కోట్ల రూపాయల సామ్రాజ్యం ఉన్న ఓ పారిశ్రామికవేత్త కూతురు. తాను సొంతంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఓ మెగా ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తుంది. అందు కోసం ఓ మురికివాడను ఖాళీ చేయించుతుంది. ఈ ప్రాజెక్టు అమలు కోసం స్థానిక ఎమ్మెల్యే బసవరాజు (సోనూసూద్) సాయం కోరుతుంది.

దీనికి ప్రతిఫలంగా ప్రాజెక్టులో వాటా ఆఫర్ చేస్తుంది సీత. అయితే తనకే వెయ్యి కోట్ల రూపాయలు ఉన్నాయని..అవి గుడ్లుపెడుతున్నాయంటూ తనను పెళ్లి చేసుకోమని కోరతాడు బసవరాజు సీతను. పెళ్ళి వంటి పర్మినెంట్ కమిట్ మెంట్స్ తనకు నచ్చవని..కావాలంటే ఓ నెల రోజులు సహజీవనం చేయటానికి రెడీ అంటూ అగ్రిమెంట్ మీద సంతకం చేస్తుంది సీత. ఒప్పందం మీద సంతకం చేసిన సీత రకరకాల సాకులు చెప్పి అందుకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతుంటుంది. సినిమా కథ అంతా ఈ వ్యవహారం చుట్టూనే తిరుగుతుంది. సీత తండ్రి వ్యాపారానికి ఆయన చెల్లెలు ఒంటి మీద నగలు ఇస్తుంది. సొంత భార్య ఇవ్వనుపో అంటే..చెల్లి మాత్రం నగలు ఇస్తుంది. ఆ చెల్లి కొడుకే రామ్ (సాయిశ్రీనివాస్). సీత తల్లి పెట్టే టార్చర్ తట్టుకోలేక భయపడిపోతాడు రామ్. అందుకే రామ్ ను ఆయన మేనమామ భూఠాన్ లోని ఆశ్రమంలో చేర్పిస్తాడు. సీత పెద్దయ్యాక తన దగ్గరకే వస్తుందని..సీతను చూసుకోవాలని చెప్పివెళ్లిపోతాడు. గత సినిమాలతో పోలిస్తే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఓ వెరైటీ కథలో నటించాడు. కాజల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఎవరికైనా అసలు దర్శకుడు ‘తేజ’కు ఏమైంది అనే అనుమానం రావటం ఖాయం. ఓవరాల్ గా చూస్తే ‘సీత’ దారి తప్పిందనే చెప్పొచ్చు.

రేటింగ్.2.25/5

Next Story
Share it