Telugu Gateway
Politics

ఎన్నికల సంఘంలో దుమారం

ఎన్నికల సంఘంలో దుమారం
X

కేంద్ర ఎన్నికల సంఘం ఈ సారి గతంలో ఎన్నడూ లేని స్థాయిలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దేశ వ్యాప్తంగా పలు పార్టీలు సీఈసీ వైఖరిని తప్పుపట్టాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ ఏది చెపితే సీఈసీ అదే చేస్తుందనే విమర్శలే ఎక్కువ విన్పించాయి. ఈ తరుణంలో ఎన్నికల సంఘంలోని సభ్యుడు అయిన అశోక్ లావాసా రాసిన లేఖ కలకలం రేపుతోంది. ప్రతి విషయంలో మోడీకి క్లీన్ చిట్ ఇవ్వటంతో పాటు..కట్టు తప్పిన నేతలను నియంత్రించటంలో సీఈసీ విఫలమైందనే అభిప్రాయంతో లావాసా ఉన్నారు. ఈ కారణంతోనే ఆయన గత కొన్ని రోజులుగా సీఈసీ సమావేశాలకు కూడా హాజరు కావటం లేదని చెబుతున్నారు.

ఎన్నికల సభల్లో చాలా మంది నేతలు కోడ్ ఉల్లంఘించినా చర్యలు తీసుకోకపోవటంపై ఆయన అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలకు క్లీన్ చిట్ వ్యవహారంపై ఆయన గుర్రుగా ఉన్నారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం అశోక్ లావాసా ఏకంగా సీఈసీకి లేఖ కూడా రాశారని చెబుతున్నారు. సీఈసీ అరోరాతో పాటు మరో సభ్యుడు సుశీల్ చంద్ర తీసుకున్న నిర్ణయాలతో ఆయన విభేదిస్తున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు సహేతుకంగా లేవనే విషయాన్ని తెలియజేసినా కూడా సీఈసీ స్పందించకపోవటంతోనే ఆయనసమావేశాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

Next Story
Share it