Telugu Gateway
Politics

చంద్రబాబు అండ్ టీమ్ కు ‘సుప్రీం’ షాక్

చంద్రబాబు అండ్ టీమ్ కు ‘సుప్రీం’ షాక్
X

విపక్షాలకు ఊహించని షాక్. ఎన్నికల ఫలితాలపై ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు వీలుగా ఈవీఎంలతో పాటు 50 శాతం వీవీప్యాట్ లను లెక్కించాలని దేశంలోని 21 పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలోనే ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా...సుప్రీంకోర్టు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్ లను లెక్కించాలని ఆదేశించింది. దీంతో సంతృప్తి చెందని విపక్షాలు ఏకంగా 50 శాతం వీవీప్యాట్ లన లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాయి. అయితే సుప్రీంకోర్టు మంగళవారం నాడు ఈ పిటీషన్ ను తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు అండ్ టీమ్ కు ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. అన్ని పార్టీల కంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడే ఈవీఎంలను తప్పుపట్టడంతో పాటు..50 శాతం వీవీప్యాట్ లను లెక్కించాలని డిమాండ్ చేశారు.

పలు పార్టీలను ఇదే అంశంపై ఆయన ఏకతాటిపైకి తెచ్చారు. అందులో భాగంగానే రివ్యూ పిటీషన్ వస్తుందని ఏకంగా చంద్రబాబు సోమవారం రాత్రే ఢిల్లీకి వెళ్ళి మంగళవారం సుప్రీంకోర్టు కు కూడా హాజరయ్యారు. ఇతర పార్టీ నేతలతో కలసి కోర్టు హాలులో కూర్చున్నారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం గతంలో ఇచ్చిన ఐదు వీవీప్యాట్ ల ఆదేశాలను మార్చే ఉద్దేశంలేదని తేల్చిచెప్పటంతో వీరికి షాక్ తగిలినట్లు అయింది. చివరకు చేసేదేమీ లేక చంద్రబాబుతోపాటు మిగిలిన పార్టీలు అన్నీ కూడా కోర్టు తీర్పును గౌరవిస్తామని పేర్కొన్నాయి. అయితే ఎన్నికలు పారదర్శకంగా జరగాలన్నదే తమ కోరిక అని చంద్రబాబుతోపాటు ఇతర పార్టీల నేతలు పేర్కొన్నారు.

Next Story
Share it