Telugu Gateway
Politics

రవిప్రకాష్..శివాజీల మధ్య ‘బోగస్ ఒప్పందం’

రవిప్రకాష్..శివాజీల మధ్య ‘బోగస్ ఒప్పందం’
X

టీవీ9 యాజమాన్యం మారకుండా ఉండేందేందుకు ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాష్ ప్రయత్నించారా?. అందులో భాగంగానే ఆయన తన వాటాగా ఉన్న షేర్లను తన మిత్రుడు, నటుడు శివాజీకి బదిలీ చేసి ఆయనతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్ సిఎల్ టి)తో కేసులు వేయించారా? అంటే ఔననే చెబుతున్నాయి పోలీసు వర్గాలు. వాస్తవానికి తాజాగా షేర్లను బదిలీ చేసి..ఎప్పటిదో పాత తేదీతో శివాజీకి షేర్లు ఉన్నట్లు చూపించటం ద్వారా రవిప్రకాష్ కథ నడిపించారన్నది పోలీసుల అభియోగం. దీనికి సంబంధించిన ఈ మెయిల్స్ వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. నిపుణుల ద్వారా ఈ పని పూర్తి చేశారు. దీంతో రవిప్రకాష్ చుట్టూ మరింత గట్టిగా ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసు ద్వారా టీవీ9 బోర్డులోకి అలందా మీడియా ప్రతినిధులు రాకుండా అడ్డుకునే ప్లాన్ చేసినట్లు స్పష్టంగా కనపడుతోందని చెబుతున్నారు. తాజా వివరాల సేకరణతో కేసు మరింత బలంగా మారుతున్నట్లు కన్పిస్తోంది. బోగస్ ఒప్పందాలు పూర్తి అయిన తర్వాత పాత మెయిల్స్ ను డిలీట్ చేసినా కూడా..సైబర్ నిపుణులు వాటిని తిరిగి సేకరించగలిగారు.

విచారణ కోసం పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. దీంతో పోలీసుల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఈమెయిల్స్‌ లో జరిగిన సంభాషణలు, డ్రాఫ్ట్స్, డ్రాఫ్ట్స్ ఒప్పందాన్ని ఫైనల్ చేస్తూ విజయవాడ లాయర్ పంపించిన పూర్తి స్థాయి డ్రాఫ్ట్స్‌ ను కూడా అధికారులు నిగ్గుతేల్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రవిప్రకాశ్‌కు, మరో ఐదుగురికి మధ్య ఈమెయిల్స్ నడిచాయి. రవిప్రకాష్, శివాజీల మధ్య ఒప్పందానికి సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్‌ ను విజయవాడకు చెందిన లాయర్ తయారు చేసినట్లు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒప్పందం చేసి.. గతేడాది ఫిబ్రవరిలో ఒప్పందం జరిగినట్టు రవిప్రకాశ్ బృందం పత్రాలు సృష్టించినట్టు పోలీసుల విచారణలో తేలింది.

Next Story
Share it