Telugu Gateway
Telangana

నేను పరారీలోను..అరెస్ట్ కాలేదు

నేను పరారీలోను..అరెస్ట్ కాలేదు
X

టీవీ9 వివాదంపై రవిప్రకాష్ స్పందించారు. కొన్ని ఛానళ్లలో ప్రస్తారం చేస్తున్నట్లుగా తాను పరారీలో లేనని తెలిపారు. తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని..చేయబోరని వ్యాఖ్యానించారు. రవిప్రకాష్ స్పందనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. "నాపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు. అభిమానులు, టీవీ9 ప్రేక్షకులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈనెల 16న ఎన్‌సీఎల్టీ కోర్టులో కేసు విచారణ జరగనుంది. ఆ కేసు ఆధారంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు. నేను అజ్ఞాతంలోకి వెళ్లాననడం అవాస్తవం. మొన్న టీవీ9లోనే బులెటిన్ చేశాను. ఉదయం నుంచి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న టీవీ చానెళ్లకు ధన్యవాదాలు. నన్నెవరూ అరెస్ట్ చేయలేదు.. చేయబోవడం లేదు. నిజం చెప్పులు వేసుకునేలోగా అబద్ధం ప్రపంచం చుట్టి వస్తుంది.

నేను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ టీవీ9 స్టూడియో నుంచే మాట్లాడుతున్నాను" అని రవిప్రకాష్ స్పష్టం చేశారు. టీవీ9 కార్యాలయంలో, రవిప్రకాష్, నటుడు శివాజీ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారని.. నోటీసులు కూడా అందించారు. దీనికి సంబంధించిన విజువల్స్ మీడియాలో ప్రసారం అయ్యాయి. గురువారం ఉదయం నుంచి టీవీ9 ప్రధాన కార్యాలయం, రవిప్రకాష్, శివాజీ ఇళ్లలో సైబర్‌క్రైమ్ పోలీసులు సోదాలు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. శుక్రవారం 11 గంటలకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్‌ల ముందు హాజరు కావాలని సీఈవో రవిప్రకాష్, శివాజీ, మూర్తి (టీవీ9 ఫైనాన్స్)కు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం నాడు ఈ వ్యవహారంలో మరిన్ని కీలక మలుపులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story
Share it