రాహుల్ గాంధీ నిర్వేదం

సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని పరాజయాన్ని మూటకట్టుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వేదంలోకి వెళ్లిపోయారు. ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా ప్రతిపాదన చేయగా..కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) దీన్ని తోసిపుచ్చింది. తనతోపాటు..తన సోదరి ప్రియాంక కూడా అధ్యక్ష పదవిలో ఉండబోమని..తమ కుటుంబం నుంచి కాకుండా ఎవరైనా ఈ పదవి చేపట్టవచ్చని రాహుల్ వాదించారు. అయినా సరే సీనియర్లు ససేమిరా అన్నారు. అదే సమయంలో రాహుల్ సీనియర్ నేతలపై మండిపడినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా పార్టీ దారుణ ఓటమి మూటకట్టుకోవటం..సీఎంలు తమ తనయులను బరిలో నిలపటానికే ప్రాధాన్యత ఇవ్వటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు.
ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన ఈ సమావేశంలో యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 52 సీట్లతో పార్టీ ఘోర పరాజయం చెందడంపై ఈ సమావేశంలో నాలుగు గంటలపాటు నేతలు చర్చించారు. పార్టీ ఓటమికి కారణాలపై సమీక్ష జరిపారు. పార్టీ కోసం పనిచేస్తానని, అధ్యక్షుడిగా కొనసాగలేనని రాహుల్ వెల్లడించినట్లు సమాచారం. ఈ ఓటమి బాధ్యత అందరిది అని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రాహుల్‌ను బుజ్జగించారు. మరి ఇందుకు రాహుల్ అంగీకరించారా? లేక ఏమైనా మార్పులు ఉంటాయా అన్నది కొద్ది రోజుల్లోనే తేలనుంది.