Telugu Gateway
Politics

ఐదేళ్ళలో ప్రయాణ ఖర్చులే 393 కోట్లు

ఐదేళ్ళలో ప్రయాణ ఖర్చులే 393 కోట్లు
X

ఐదేళ్ళు. 393 కోట్ల రూపాయలు. ఇవి కేవలం ప్రయాణ ఖర్చులే. ఇతర ఖర్చుల సంగతి వేరే లెక్క. కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదీరిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ, ఇతర కేంద్ర మంత్రులు కలిపి చేసిన పర్యటనలకు అయిన మొత్తం ఇది. ప్రభుత్వ సొమ్ము దుబారా విషయంలో కాంగ్రెస్ పార్టీపై గతంలో చాలా విమర్శలు వచ్చేవి. కానీ ప్రధాని నరేంద్రమోడీ మాత్రం విదేశీ పర్యటనలు..ప్రకటనల ఖర్చు విషయంలో గత పాలకులను అన్ని రకాలు దాటిపోయినట్లు రాజకీయ వర్గాల్లో విమర్శలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో కలుపుకుని మోడీ ప్రచార వ్యయం వేల కోట్ల రూపాయల్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా సమాచార చట్టం కింద మోడీతోపాటు మంత్రుల పర్యటనల వివరాల వ్యయం కోరితే ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఈ వివరాలు వెల్లడించింది. 2014 మే నుంచి ప్రధాని, కేంద్ర మంత్రులు దేశ, విదేశీ పర్యటనల నిమిత్తం ఎంత ఖర్చు చేశారని అనిల్‌ గల్గాలీ అనే సామాజిక కార్యకర్త ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) బదులిచ్చింది. 2014 జూన్‌ నుంచి మోదీ విదేశీ పర్యటనలకు అయిన మొత్తం రూ.2,021 కోట్లు అని రాజ్యసభలో గతేడాది అడిగిన ప్రశ్నకు మోదీ ప్రభుత్వం సమాధానమిచ్చింది.

ఈ మొత్తం మోదీ విదేశీ పర్యటనల సమయంలో చార్టర్డ్‌ విమానాలు, విమానాల నిర్వహణ, హాట్‌లైన్‌ సదుపాయాల నిమిత్తం ఖర్చు చేసినట్లు పేర్కొంది. కానీ పీఎంవో మాత్రం 393 కోట్ల రూపాయలు అని చెప్పటం విశేషం. ప్రధాని, ఆయన మంత్రులు విదేశీ పర్యటనల కోసం రూ.263 కోట్లు వెచ్చించగా, దేశీయ పర్యటనలకు రూ.48 కోట్లు ఖర్చు అయినట్లు ఆర్టీఐ సమాచారంలో పేర్కొన్నారు. అలాగే సహాయ మంత్రుల విదేశీ పర్యటనలకు రూ.29 కోట్లు, దేశీయ పర్యటనలకు 53 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. 2014–15 ఏడాదిలో అత్యధికంగా ప్రధాని, మంత్రుల విదేశీ పర్యటనలకు రూ.88 కోట్లు ఖర్చయినట్లు పేర్కొంది. పీఎంఓ వెబ్‌సైట్‌ ప్రకారం 2014 మే నుంచి 2019, ఫిబ్రవరి 22 వరకు మోదీ 49 విదేశీ పర్యటనలు చేశారు.

Next Story
Share it