Telugu Gateway
Politics

ఈసీ దగ్గర చంద్రబాబు టీమ్ కు మరో షాక్

ఈసీ దగ్గర చంద్రబాబు టీమ్ కు మరో షాక్
X

ముందు ఈవీఎంల కౌంటింగ్. ఆ తర్వాతే వీవీప్యాట్ ల కౌంటింగ్. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని బుధవారం తేల్చిచెప్పింది. తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇదే అంశంపై మంగళవారం నాడు పలు పార్టీల నేతలతో కలసి కేంద్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందజేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాము బుధవారం తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని ఈసీ ప్రకటించింది. చెప్పినట్లుగానే ఈసీ బుధవారం మధ్యాహ్నాం కౌంటింగ్ విధానంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. చంద్రబాబునాయుడు ఈ అంశంపై గత కొంత కాలంగా తీవ్ర ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

తొలుత కనీసం 50 శాతం వీవీప్యాట్ లు అయినా లెక్కించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ పిటీషన్ ను కొట్టేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్ గా తీసుకుని ఐదు వీవీప్యాట్లు..పార్లమెంట్ నియోజకవర్గంలో 35 వీవీప్యాట్లు మాత్రం కౌంటింగ్ చేయాలని సుప్రీం ఆదేశించింది. ఇదిలా ఉంటే చంద్రబాబు కొత్తగా మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. ముందు వీవీప్యాట్లు లెక్కించాక..తర్వాత ఈవీఎంల కౌంటింగ్ చేయాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అయితే ఈ ప్రతిపాదనకు కూడా చుక్కెదురు అయింది. ఈవీఎంలు, వీవీప్యాట్లలో నమోదు అయిన ఓట్ల విషయంలో తేడా వస్తే వీవీప్యాట్లలోనే ఓట్లనే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.

Next Story
Share it