Telugu Gateway
Telangana

టీవీ9లో మెజారిటీ వాటాదారుల‌కు అడ్డంకులు క‌ల్పించారు

టీవీ9లో మెజారిటీ వాటాదారుల‌కు అడ్డంకులు క‌ల్పించారు
X

ఇక నుంచి టీవీ9కి సంబంధించి ఎవ‌రూ ర‌విప్ర‌కాష్‌, కె వి ఎన్ మూర్తితో డీల్ చేయ‌వ‌ద్ద‌ని అలందా మీడియా డైర‌క్ట‌ర్ సాంబ‌శివ‌రావు కోరారు. సంస్థ‌లో త‌మ‌కు 90.54 శాతం వాటా ఉన్నా కూడా మేనేజ్ మెంట్ లోకి రాకుండా ప‌లు అవ‌రోధాలు క‌ల్పించార‌ని ఆరోపించారు. వాటి అన్నింటిని అధిగ‌మించి ఇప్పుడు పూర్తిగా సంస్థ‌ను త‌మ ఆధీనంలోకి తెచ్చుకున్నామ‌ని వెల్ల‌డించారు. అలందా మీడియా సంస్థ డైర‌క్ట‌ర్లు శుక్ర‌వారం సాయంత్రం మీడియా సమావేశం పెట్టి దీనికి సంబంధించిన ప‌లు వివ‌రాలు వెల్ల‌డించారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్న దాని కంటే జ‌ర్న‌లిజం ప్ర‌మాణాలు మ‌రింత పెరుగుప‌ర్చేలా టీవీ9ని తీర్చిదిద్దుతామ‌ని తెలిపారు. అవ‌స‌రం అయితే దీని కోసం కొత్త‌గా మ‌రికొంత మందిని తీసుకుంటామ‌ని తెలిపారు. టీవీ9 ఉద్యోగులు అంద‌రితో కూడా మాట్లాడామ‌ని త‌మ‌కు స‌హ‌క‌రించ‌టానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. టీవీ9 సీఈవో, డైరెక్టర్‌ పదవి నుంచి రవిప్రకాశ్‌ను తొలగిస్తున్నట్లు ఈ సంస్థ డైరెక్టర్లు ప్రకటించారు. టీవీ9 సంస్థలో చోటుచేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో బోర్డుసభ్యులు శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.

రవి ప్రకాశ్‌ స్థానంలో కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రాను, సీవోవోగా గొట్టిపాటి సింగారావు నియమిస్తున్నట్లు అలందా మీడియా డైరెక్టర్‌ ఎస్‌ సాంబశివరావు ప్రకటించారు. సంస్థలో అవకతవకలు చోటుచేసుకున్నాయని తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో మే 8న ఆయనను పదవి నుంచి తొలగించామని తెలిపారు. 9 నెలల క్రితమే టీవీ9లో 90.5 శాతం వాటలను ఏవీసీఎల్‌ నుంచి అలందా మీడియా కొనుగోలు చేసిందని, కొనుగోలు అనంతరం సంస్థలో చాలా అవరోధాలు సృష్టించారని ఆయన వెల్లడించారు. డైరెక్టర్ల సమావేశం జరగకుండా రవి ప్రకాశ్‌, మూర్తి అడ్డుపడ్డారని అన్నారు. టీవీ9 సంస్థలలోకి కొత్తగా నలుగురు డైరెక్టర్లను తీసుకుంటున్నట్లు తెలిపారు. కంపెనీ సెక్రటరీ సంతకాన్ని రవి ప్రకాశ్‌ ఫోర్జరీ చేశారని ఆయన వెల్లడించారు. యజమాన్య మార్పిడి విషయంలో కొన్ని అవరోధాలు ఎదురైయ్యాయని, టీవీ9లోని అన్ని ఛానెళ్లు కొత్త సంస్థ పరిధిలోకి వస్తామని తెలిపారు.

Next Story
Share it