Telugu Gateway
Politics

తీవ్ర అసంతృప్తిలో నారా లోకేష్!

తీవ్ర అసంతృప్తిలో నారా లోకేష్!
X

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఆపద్ధర్మ మంత్రి నారా లోకేష్ పార్టీ అధినేత, తన తండ్రి చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తి..ఆగ్రహంతో ఉన్నారా?. అంటే ఔననే చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు. రాజకీయంగా తనకు అత్యంత సురక్షితమైన ‘సీటు’ కాకుండా..అత్యంత రిస్క్ తో కూడిన సీటు తనకు కేటాయించటం ద్వారా తన రాజకీయ భవిష్యత్ లో కోలుకోలేని మచ్చ వేశారనే అభిప్రాయంతో ఆయన ఉన్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టీడీపీ భవిష్యత్ నేతగా ఉన్న లోకేష్ పోటీచేసిన తొలిసారే ఓటమి పాలు అవటం టీడీపీ నేతలను కూడా షాక్ కు గురిచేసింది. ఆయన నియోజకవర్గంపైనే రాష్ట్రంలో అత్యధిక బెట్టింగ్ లు సాగినట్లు సమాచారం. ఎమ్మెల్సీ అయి..మంత్రి కావాలనేది నారా లోకేష్ తోపాటు ఆయన కుటుంబ సభ్యుల కోరిక అయినా..సేఫ్ సీటు లో కాకుండా మంగళగిరిలో పోటీ చేయించి తన ఓటమికి కారణం కావటంపై లోకేష్ కోపంతో రగిలిపోతున్నారని చెబుతున్నారు. ఏపీలో పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11 సాయంత్రమే నారా లోకేష్ తన నివాసంలో మంగళగిరి సీటు కేటాయించటంపై నానా హంగామా చేసినట్లు పార్టీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, విజన్ ఉన్న నేతగా కీర్తింపబడే చంద్రబాబునాయుడు తన రాజకీయ వారసుడికి అత్యంత కీలకమైన సీటును ఖరారు చేయటంలో కూడా చివరి నిమిషం వరకూ జాప్యం చేసి దెబ్బకొట్టారనే అభిప్రాయం పార్టీ నేతల్లో కూడా వ్యక్తం అవుతోంది.

అన్ని వనరులు ఉండి..అధికారంలో ఉండి..ముఖ్యమంత్రి తనయుడిగా ఉన్న నారా లోకేష్ తాను పోటీ చేయాలనుకున్న నియోజకవర్గాన్ని ఓ రెండేళ్ళ ముందే నిర్ణయించుకుని ఫోకస్ చేయాల్సింది పోయి..ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత అప్పటికప్పుడు మంగళగిరి సీటును ఎంపిక చేసి కేటాయించటం ‘చారిత్రక తప్పిదం’ అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం గత చరిత్ర చూస్తే కూడా టీడీపీకి అక్కడ అంత పెద్దగా బేస్ లేదనే విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న తాము ఏమి చేసినా నడిచిపోతుంది..ఎంత అంటే అంత డబ్బులు వెదజల్లి అయినా గెలవొచ్చనే ధీమానే టీడీపీని దారుణ ఓటమి పాలు చేసిందని సీనియర్ నేతలు ఇప్పుడు విశ్లేషించుకుంటున్నారు.

ప్రధాని మోడీతో చంద్రబాబునాయుడు అవసరానికి మంచి పెట్టుకున్న ఘర్షణ కారణంగా కేంద్ర ఏజెన్సీలతో పాటు..అన్ని రకాలుగా టీడీపీ ‘ఒత్తిడి’ని ఎదుర్కోవాల్సి వచ్చింది. డబ్బు ఎంత అంటే అంత ఉన్నా కూడా..దాన్ని ఓటర్లకు చేర్చటంలో టీడీపీ ఘోరంగా విఫలమైందనే విషయం ఆ పార్టీ నేతల్లో ఇఫ్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. చివరి నిమిషం వరకూ స్కీమ్ లు..స్కామ్ లపై ఫోకస్ పెట్టడం తప్ప...‘రాజకీయం’ సంగతిని మర్చిపోవటం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మంగళగిరి సీటును ఎంచుకోవటంపై ఎన్నికల సమయంలో స్పందించిన నారా లోకేష్ సేఫ్ సీటులో ఎవరైనా గెలుస్తారు..కష్టపడి గెలుద్దామనే ఇక్కడకు వచ్చానన్నారు. ఫలితం ఏమైందో అందరికీ తెలిసిందే.

Next Story
Share it