Top
Telugu Gateway

తొలి ప్రయత్నంలో లోకేష్ కు షాక్

తొలి ప్రయత్నంలో లోకేష్ కు షాక్
X

తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నేతగా కీర్తించబడుతున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కు మంగళగిరి ఓటర్లు షాక్ ఇఛ్చారు. తొలి ప్రయత్నంలోనే ఆయన దారుణ ఓటమిని చవిచూశారు. ఎమ్మెల్సీ మార్గంలో సభలోకి అడుగుపెట్టి ..మంత్రి పదవి దక్కించుకున్న లోకేష్ పై తీవ్ర విమర్శలు విన్పించాయి. చివరకు సొంత పార్టీ నేతలు కూడా ఇది ఏమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. అయినా చంద్రబాబు, లోకేష్ ఇవేమీ పట్టించుకోలేదు. కానీ ఈ ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. నారా లోకేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి 5312 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు మంత్రివర్గం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. 24 మంది మంత్రుల్లో 22 మంది పోటీచేయగా 19 మంది ఘోర పరాజయాన్ని చవిచూశారు. అత్యంత కీలకమైన సాగునీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరంలో ఓటమిపాలయ్యారు.

మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర.. గుంటూరు జిల్లాకు చెందిన నక్కా ఆనంద్‌బాబుకు వేమూరులో పరాభవం ఎదురైంది. చంద్రబాబు కేబినెట్‌లో వ్యవ సాయ శాఖ మంత్రులుగా పనిచేసిన ఇద్దరూ ఓటమి పాలయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు, ఆ తర్వాత ఆ శాఖను చేపట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పరాజయం పొందారు. పుల్లారావు గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పోటీచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విడదల రజనీ చేతిలో ఓడి పోయారు. సోమిరెడ్డి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. పశుసంవర్థక శాఖకు మంత్రిగా పనిచేసిన ఆదినారాయణరెడ్డి కూడా కడప లోక్‌సభ నుంచి వైఎస్‌ అవినాష్‌రెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందారు. చివరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్‌ మంత్రి కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఓడిపోయారు. మంత్రి పితాని సత్యనారాయణ, చెరకువాడ రంగనాథ రాజు చేతిలో ఓటమి చవిచూశారు. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి గెలిచి మంత్రి అయిన కేఎస్‌ జవహర్‌పై అక్కడి కేడర్‌ తిరుగుబాటు చేయడంతో చంద్రబాబు ఆయనకు కృష్ణా జిల్లా తిరువూరు సీటిచ్చినా ప్రయోజనం లేకుండాపోయింది. తిరువూరులో వైఎస్సార్‌సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రక్షణనిధి చేతిలో జవహర్‌ ఓడిపోయారు. చంద్రబాబు కేబినెట్‌లో సీనియర్‌ మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఘోరంగా ఓడిపోయారు.

ఇటీవల వరకూ మంత్రిగా ఉన్న అదే జిల్లాకు చెందిన కిడారి శ్రావణ్‌కుమార్‌ అరకులో పరాజ యం పాలయ్యారు. వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరా యించి మంత్రి పదవులు పొందిన సుజయకృష్ణ రంగారావు, అమర్‌నాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. పార్టీ ఫిరాయించి మంత్రి పదవి పొందిన ఆదినారాయణరెడ్డి కడప ఎంపీగా పోటీచేసి ఘోరంగా ఓడిపోయారు. మంత్రిగా ఉండి ఒంగోలు ఎంపీగా బరిలోకి దిగిన శిద్ధా రాఘవరావుకూ ఓటమి తప్పలేదు. చంద్రబాబు సన్నిహితుడిగా.. ఆయన మంత్రివర్గంలో కీలకంగా ఉండి, రాజధాని వ్యవహారాలను పర్యవేక్షించి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మరో మంత్రి నారాయణ నెల్లూరు సిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ చేతిలో ఓడిపోయారు.

Next Story
Share it