పత్తిపాటి ఫ్యామిలీ టోల్ ఫీజు కట్టలేని పేదరికంలో ఉందా?
నిజంగా ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఫ్యామిలీ అంత పేదరికంలో ఉందా?. టోల్ ఫీజు కూడా కట్టమంటే గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది?. టోల్ సిబ్బందితో గొడవ పడి ఆ మార్గంలో వెళ్ళే ప్రయాణికులను ఇబ్బందుల పాలు చేయాలా?.కాలం తీరిన పాస్ పెట్టుకుని..ఎమ్మెల్యే..మంత్రి అంటే అనుమతిస్తారా?. పోనీ నిజంగా ఆ వాహనంలో ఎమ్మెల్యే, మంత్రి ఉంటే పాస్ తో పని లేకుండా అయినా అనుమతించవచ్చు.. కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరికీ టోల్ గేట్లలో ఫ్రీ పాస్ లు ఉంటాయా?. ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్య చేసిన హంగామా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓ మంత్రి భార్య అయి ఉండి వంద..రెండు వందల రూపాయల కోసం టోల్ గేట్ దగ్గర కూడా ఘర్షణ పడాల్సిన అవసరం ఉందా?. అసలు ఏమి జరిగిందో..మీరే చూడండి. మంత్రి భార్య అయిన తనను టోల్ ఫీజు అడుగుతారా అంటూ ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య హల్‌చల్ చేశారు. అద్దంకి -నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రం వద్ద ఉన్న టోల్‌ప్లాజా దగ్గర ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య, కుటుంబ సభ్యులు శుక్రవారం సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. మంత్రి భార్య తన కారులో హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్నారు. మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద టోల్ రుసుము చెల్లించాలని సిబ్బంది ఆమె కారును ఆపారు.
దాంతో ఆమె ‘నేను మంత్రి భార్యను. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది’అని చెప్పారు. కానీ స్టిక్కర్ అనుమతి కాలపరిమితి దాటిందని, టోల్ రుసుము చెల్లించకుంటే కారు వేళ్లనిచ్చేది లేదని టోల్‌ప్లాజా సిబ్బంది తేల్చి చేప్పారు. స్టిక్కర్ గడువు ముగియడం, కారులో ఎమ్మెల్యే లేకపోవడంతో టోల్‌ప్లాజా సిబ్బంది ఆర్‌అండ్‌బీ రూల్స్ ప్రకారం టోల్ రుసుము చెల్లించాలని చెప్పారు. మంత్రి భార్య, కుటుంబ సభ్యులు అరగంట సేపు టోల్‌ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చివరికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పీఏ ఫోన్ చేసి చెప్పినా వారు అనుమతి ఇవ్వకపోవడంతో టోల్ రుసుము చెల్లించి వెళ్లారు. మంత్రి భార్య నిర్వాకంతో టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. ఆ సమయంలో ప్రయాణికులు మంత్రి భార్య తీరునే తప్పుపట్టారు.