Telugu Gateway
Cinema

ప్రేక్షకులపై అదనంగా 62 రూపాయల ‘మహేష్ ట్యాక్స్!’

ప్రేక్షకులపై అదనంగా 62 రూపాయల ‘మహేష్ ట్యాక్స్!’
X

ఒక్క మహర్షి సినిమాకు ప్రత్యేక రేట్లు..ఎవరి ప్రయోజనాల కోసం?

ఏంటి ‘మహర్షి’ సినిమా ప్రత్యేకం. ఎందుకు ఒక్క మహేష్ బాబు సినిమాకు సర్కారు ‘ప్రత్యేక రేట్ల’కు అనుమతి ఇచ్చింది. సాక్ష్యాత్తూ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాత్రం రేట్ల పెంపునకు సర్కారు అనుమతి ఇవ్వలేదని ప్రకటించారు. కానీ హైదరాబాద్ లోని ఐమ్యాక్స్ మల్టీఫ్లెక్స్ లో మహర్షి సినిమాకు ఒక్కో టిక్కెట్ పై 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు పెద్ద ఎత్తున అమ్మకాలు జరిపేశారు. టిక్కెట్ పై కూడా రేటు స్పష్టంగా 200 రూపాయలు అని ఉంది. కానీ ప్రసాద్ మల్టీఫ్లెక్స్ లో ఇతర సినిమా టిక్కెట్ల ధరలు మాత్రం ఎప్పటిలాగానే 138 రూపాయలు మాత్రమే. కానీ ఒక్క మహేష్ బాబు సినిమాకు మాత్రమే ప్రత్యేక రేట్లు అనేది ఓ కొత్త పోకడ. గతంలో పలుమార్లు పెద్ద హీరోల సినిమాలకు ఐదు షోలకు అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు కూడా మహర్షికి అలాగే ప్రత్యేక షోకు అనుమతి మంజూరు చేశారు. అంత వరకూ పెద్దగా ఎవరికీ అభ్యంతరాలు లేకపోయినా కేవలం ఈ ఒక్క సినిమాకు మాత్రమే రేట్లు పెంచటం ఎవరి ప్రయోజనాల కోసం?.

ఇది దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీల ప్రయోజనాల కోసమా? లేక హీరో మహేష్ బాబు కోసమా?. ఎందుకు ఈ ప్రత్యేక సౌకర్యాలు. ప్రేక్షకుల దగ్గర ఒక్కో టిక్కెట్ పై అదనంగా 62 రూపాయలు దోచిపెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది. నిజంగా ప్రసాద్ ఐమ్యాక్స్ ఎవరి అనుమతి లేకుండానే ఇలా టిక్కెట్లు ధరలు పెంచుకుందా? ఆ అధికారం థియేటర్ యాజమాన్యానికి ఉందా?.. సర్కారు మరి ఈ ధరల పెంపు వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. ఏమైనా ఓ హీరో సినిమాకు ప్రత్యేక రేట్ల సౌకర్యం ఒక్కసారి కల్పిస్తే స్టార్ హీరోలుగా క్లైయిం చేసుకుంటున్న వారు అందరూ ఇదే ట్రెండ్ కు శ్రీకారం చుడతారు. అంతిమంగా నష్టపోయేది ప్రేక్షకులే. హీరోల ఆధారంగా టిక్కెట్ల రేట్ల నిర్ణయం బహుశా ఇదే మొదటి సారేమో.

Next Story
Share it