Telugu Gateway
Cinema

‘మహర్షి’ మూవీ రివ్యూ

‘మహర్షి’ మూవీ రివ్యూ
X

భూముల విలువ పెరుగుతుంది. రైతుల విలువ తగ్గుతుంది. అన్ని భూముల్లో పెద్ద పెద్ద బిల్డింగ్ లు కడితే పంటలు ఎక్కడ పండుతాయి. ఏమి తింటారు.?. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ‘మహర్షి’ సినిమా కాన్సెప్ట్. చిన్నప్పుడే ఎన్నో కష్టాలు చవిచూసిన రిషి కసితో ‘సక్సెస్’ కోసం ప్రయత్నించి..విజయం సాధిస్తాడు. తాను కోరుకున్న ‘సక్సెస్’ అందుకున్న తర్వాత ఇదే నిజమైన విజయమా? అన్న ఆలోచన మొదలవుతుంది. అందుకే ఏటా వందల కోట్ల రూపాయల వేతనం ఇచ్చే అమెరికాలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ఇండియాకు వస్తాడు. ఎంతో పేరున్న కంపెనీ సీఈవో భారత్ కు వచ్చి..అదీ ఓ గ్రామంలో ఎందుకు మకాం వేస్తాడు. ఎందుకు వ్యవసాయం చేస్తాడు. రైతుల తరపున ఎందుకు పోరాడతాడు. కార్పొరేట్ కంపెనీల కోసం..భారీ ప్రాజెక్టుల కోసం రైతుల భూములు తీసుకోవటం, గ్రామాలకు గ్రామాలు ఖాళీలు చేయించటం వంటి ప్రయత్నాలు..వాటిని హీరోలు తమ హీరోయిజంతో అడ్డుకోవటం వంటి లైన్ లో ఇఫ్పటికే సినిమాలు చాలానే వచ్చాయి. మరి మహేష్ బాబు తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాకు ఇంత సాదాసీదా కథను అంగీకరించటమే విశేషం.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాత్రం సినిమాలో పెద్దగా ‘మేజిక్’లు ఏమీ లేకుండానే లాగించేశారు. రిషి, రవి (అల్లరి నరేష్) కాలేజీల్లో చదువుకునే రోజుల్లో వచ్చే కామెడీ సన్నివేశాలో సినిమాలో కాస్త రిలీఫ్. హీరోయిన్ పూజా హెగ్డె పాత్రకు కూడా పెద్దగా ప్రాధాన్యత ఏమీలేదు. రిషి, పూజాల లవ్ ట్రాక్ లో బ్రేకప్ తర్వాత ఓ గేమింగ్ కంపెనీలో చేరుతోంది. చివరకు రిషి పనిచేసే ఆరిజన్ కంపెనీతో ఒప్పందం కోసం పూజా అక్కడకే వెళ్ళాల్సి వస్తుంది. దీనికి తొలుత పూజా అంగీకరించకపోతే ఒక్కో ఐటి ఉద్యోగిపై ఎంత మంది ఆధారపడి ఉంటారనే విషయాన్ని విద్యుల్లేఖ రామన్ చెప్పే డైలాగ్ లు ఆకట్టుకుంటాయి. దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాను చాలా రిచ్ గా చూపించారు.

ఫస్టాఫ్ లో అక్కడక్కడ కామెడీ ఉన్నా..సెకండాఫ్ మాత్రం సీరియస్ గానే సాగుతుంది. సినిమాలో భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు పర్పెక్ట్ గా తీర్చిదిద్దారు. మహర్షి సినిమాలో అల్లరి నరేష్ కు చాలా బలమైన పాత్రే దక్కింది. రిషి స్పూర్తితో పబ్ ల్లో మందుకొడుతూ ఎంజాయ్ చేసే యూత్ కూడా ‘వీకెండ్ అగ్రికల్చర్’ అనే కాన్సెప్ట్ ను తెరమీదకు తెస్తారు. ఈ సినిమాలో కీలక పాత్రదారులైన ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయసుధ, పోసాని కృష్ణ మురళీ పాత్రలు ఇప్పటికే చాలా సినిమాల్లో చూసినట్లే ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. ఓవరాల్ గా చూస్తే ‘మహర్షి’ సినిమాను అమ్ముకోవటానికి రైతులను నమ్ముకున్నారు. కాకపోతే పెద్ద సినిమాలు ఏమీ లేని ఈ వేసవి సెలవుల్లో ఓ సారి చూడదగ్గ సినిమానే.

రేటింగ్.. 2.75/5

Next Story
Share it