Telugu Gateway
Andhra Pradesh

కుటుంబరావు...కంప్యూటర్లను నమ్మకుంటే అంతే మరి!

కుటుంబరావు...కంప్యూటర్లను నమ్మకుంటే అంతే మరి!
X

రాజకీయాలు చేయాలంటే రాజకీయ నేతలతోనే చేయాలి. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని కుటుంబ రావు...కంప్యూటర్లతో రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది. గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇఛ్చిన అత్యంత కీలకమైన హామీ రైతు రుణమాఫీ. ఇప్పటికీ అది పూర్తి కాలేదు. ఇంకా దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకూ పెండింగ్ ఉంది. రైతు రుణ మాఫీ విషయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా ఉన్న కుటుంబరావు చేసిన ‘డిజైన్’ పార్టీ కొంపముంచిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఒక్క రుణ మాఫీ విషయమే కాదు..రాజధాని విషయంలో ‘సింగపూర్ కంపెనీల’తో కుదుర్చుకున్న ‘స్విస్ ఛాలెంజ్’ ఒప్పందం విషయంలోనూ కుటుంబరావు పెత్తనం అప్పట్లోనే అధికార వర్గాల్లోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎప్పటిలాగానే చంద్రబాబు ఈ సారి కూడా తన రాజకీయాలు అన్నీ సీనియర్ నేతలు..సీనియర్ ఎమ్మెల్యేలను వదిలి కుటుంబరావుతోపాటు..మరికొంత మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు..మీడియా అధినేతలతో సాగించటం వల్లే ఈ దారుణ పరాభావం అని సీనియర్ నేతలు మండిపడుతున్నారు.

ఏ ప్రభుత్వం అయినా మంచి పనులు చేస్తే అవి ప్రజల మనస్సుల్లో పాతుకుపోతాయని..వాటిపై పెద్దగా ప్రచారం కూడా చేయాల్సిన అవసరం కూడా ఉండదని ఓ నేత వ్యాఖ్యానించారు. ఒక్క రైతు రుణమాఫీయే కాకుండా..అగ్రిగోల్డ్ కుంభకోణం బాధితులను ఆదుకోవటంతోపాటు పలు విషయాల్లో కుటుంబరావును చంద్రబాబు విపరీతంగా ప్రోత్సహించారు. ఇది టీడీపీలోని సీనియర్ నేత..ఆర్థిక మంత్రి యనమల వంటి వారిని కూడా కొన్ని దశల్లో ఇబ్బందికి గురిచేసింది. ఒక్క కుటుంబరావే కాదు..ఈ జాబితాలోకే పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా వస్తారు. ఆర్ధిక అంశాల్లో తప్ప ‘రాజకీయాలు’ నారాయణకు ఏమి తెలుసని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కేవలం నారాయణ కాబట్టే తాత్కాలిక సచివాయల నిర్మాణంలో ఎన్నో దారుణ వైఫల్యాలు ఉన్నా చంద్రబాబు వెనకేసుకు వచ్చారని..దీనికి ‘ఆర్థికపరమైన’ బంధాలే కారణం అని చెప్పారు.

అంతే కాదు..ప్రజలతో ‘కనెక్ట్’ కావాల్సిన పార్టీ..రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) అంటూ నిత్యం కంప్యూటర్లతో కనెక్ట్ అయి...ఫోన్లు చేయకుండానే కోట్లాది మంది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని..సంతృప్తస్థాయి ఆకాశమే హద్దుగా సాగుతోందని..అన్ని నివేదికలు తన దగ్గర ఉన్నాయని చెప్పుకుంటూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు తనను తానే మోసం చేసుకున్నారని మరో నేత వ్యాఖ్యానించారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ పెట్టాక ఇంత దారుణ ఓటమి ఇదే కావటంతో ఆ పార్టీ నేతల్లో కూడా తీవ్రమైన మధనం సాగుతోంది. ఇఫ్పటికి కూడా చంద్రబాబు నిజాలను అంగీకరించి...చిత్తశుద్ధితో సమీక్ష చేస్తారనే నమ్మకం తమకులేదని పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నా ఇలాంటి వారు కూడా కీలక పాత్ర పోషించారని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it