దిల్ రాజుకు ఐటి షాక్
ఓ వైపు మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా విడుదల హంగామా. మరో వైపు దిల్ రాజు కార్యాలయాలపై ఐటి శాఖ దాడులు. గతంలో ఎన్నడూ లేనట్లు ఒక్క ‘మహర్షి’ సినిమా టిక్కెట్ల రేటు పెంపు తెలంగాణలో పెద్ద దుమారమే రేపుతోంది. ఓ వైపు ప్రభుత్వం తాము ఎవరికీ అనుమతి ఇవ్వలేదని చెబుతుంటే ప్రసాద్ మల్టీప్లెక్స్ తోపాటు పలు థియేటర్లలో అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో ఐటి దాడులు ప్రాధాన్యత సంతరించుకుంది.
మహర్షి సినిమాకు దిల్ రాజుతోపాటు అశ్వనీదత్, పీవీవీలు నిర్మాతలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అమీర్‌పేట శ్రీనగర్ కాలనీలోని దిల్‌రాజు కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం నాడు సోదాలు నిర్వహించారు. ఒక సినిమాకు ముగ్గురు ప్రముఖ నిర్మాతలు భాగస్వామిగా ఉండి తెరకెక్కించటమే అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. మహర్షి మూవీ గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.