ఏపీలో అధికార మార్పిడిపై ఐఏఎస్ లకు క్లారిటీ!

మరికొన్ని గంటల్లోనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఫలితాల కోసం ప్రజలతోపాటు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే ఐఏఎస్ లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది ఐఏఎస్ లు ఏపీలో అధికార మార్పిడి ఖాయం అనే నిర్ణయానికి వచ్చేశారు. అందులో భాగంగానే జగన్ ప్రభుత్వంలో ఎవరికి ప్రాధాన్యత దక్కుతుంది. చంద్రబాబు హయాంలో వెలుగు వెలిగిన వారి పరిస్థితి ఏమిటి అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. వైఎస్ హయాంలో కీలక పాత్ర పోషించిన వారితో పాటు..కొంత మంది కొత్త వారికి కూడా జగన్ తన కొత్త టీమ్ లో చోటు కల్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.ఎన్నికలు పూర్తయిన వెంటనే చాలా మంది అధికారులు ఫలితాల ట్రెండ్ ను తెలుసుకునే ప్రయత్నం చేసి..చంద్రబాబు ఇంటికి..జగన్ అధికారంలోకి రావటం ఖాయం అని నిర్ణారణకు వచ్చి తదనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
ఎవరిని కలిస్తే కీలక పదవులు వస్తాయో అన్న అంశంపై ఎవరి కసరత్తు వారు చేసుకుంటున్నారు.మాజీ సీఎస్ అజయ్ కల్లాం తాజాగా అమరావతిలో జరిగిన వైసీపీ అభ్యర్ధుల శిక్షణ కార్యక్రమం వేదికగా ప్రత్యక్షం అవటం కూడా ఐఏఎస్ ల్లో వైసీపీ వస్తుందనే నిర్దారణకు వచ్చినట్లు చెబుతున్నారు. గత కొంత కాలంగా ఏపీ సీఎం చంద్రబాబు విదానాలను తప్పుపడుతూ వస్తున్న ఆయన తొలిసారి పార్టీ వేదికపైకి వచ్చారు. ఆయనతోపాటు మరో రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వంలో అజయ్ కల్లాంకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.