Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ వేడుకలను ఇక నేనే చూసుకుంటా!

ఎన్టీఆర్ వేడుకలను ఇక నేనే చూసుకుంటా!
X

తెలుగుదేశం అధినేత, ఆపద్ధర్మ సీఎం చంద్రబాబు అమరావతికి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ ఘాట్ ను పూర్తిగా వదిలేశారు. జయంతికి..వర్థంతికి కూడా ఇటు రావటం పూర్తిగా మానేశారు. రాజకీయాల కోసం నిత్యం ప్రత్యేక విమానాలు వేసుకుని మరీ తిరిగిన చంద్రబాబు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ ఘాట్ సందర్శన మర్చిపోయారు. ఇదే విషయంపై ఒకప్పటి పార్టీ సీనియర్ నేత మొత్కుపల్లి నర్సింహులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం నాడు ఎన్టీఆర్ 97వ జయంతి. ఎప్పటిలాగానే ఆయనకు నివాళి అర్పించేందుకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నారు. కానీ అక్కడ ఎలాంటి అలంకరణలు చేసి ఉండకపోవటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

వెంటనే పెద్ద ఎత్తున పూలు తెప్పించి తానే స్వయంగా తాత సమాధిని అలంకరించారు. అక్కడ ఉన్న అభిమానుల సాయంతో సమాధి మొత్తం పూలతో నిండేలా చేశారు. తర్వాత పుష్పగుచ్చాలతో తారక్, కల్యాణ్‌రామ్ లు ఎణ్టీఆర్ కు నివాళులు అర్పించారు. తాత సమాధి పక్కనే కాసేపు మౌనంగా కూర్చున్నారు. ఇక నుంచి తాత వర్ధంతి, జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి జూనియర్ ఎన్టీయార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ లో నారా బ్రాహ్మణీ ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి దివంగత నేతకు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా పలువురు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పించారు.

Next Story
Share it