ఓటమితో నిరాశ లేదు..కవిత

ఓటమితో తాను నిరాశ చెందటంలేదని నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదన్నారు. పదవులు ఉన్నా లేకున్నా తాను తెలంగాణ కోసం కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమని అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ స్థానాన్ని వదిలే ప్రసక్తే లేదని, కార్యకర్తలు అధైర్యపడొద్దన్నారు. జిల్లాలోని మోపాల్ మండలం మంచిప్పలో టీఆర్‌ఎస్ కార్యకర్త కిషోర్ కుమార్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబాన్ని సోమవారం మాజీ ఎంపీ కవిత పరామర్శించారు. కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 68వేల ఓట్ల భారీ తేడాతో కవిత ఓటమిపాలైన విషయం తెలిసిందే. కవితకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడం ఆమె ఓటమికి కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఆర్మూర్ ప్రాంతంలో పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని, గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని సుమారు 178 మంది రైతులు ఆమెకు వ్యతిరేకంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేశారు. అంతటితో ఆగకుండా కవిత ఓటమే లక్ష్యంగా ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. దీని ప్రభావం కవిత ఓటమిపై పడిందని టీఆర్‌ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ సారి నిజామాబాద్ ప్రజలు తనను కాదని..వేరే వాళ్ళను గెలిపించారని..గెలిచిన వాళ్లు నిజామాబాద్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.