నారా లోకేష్ సంచలన ప్రకటన
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆపద్ధర్మ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నియోజకవర్గం నుంచే బరిలో దిగుతానని ప్రకటించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని..ఓటమిపై కుంగిపోవాల్సిన అవసరం లేదని తనను కలవటానికి వచ్చిన కార్యకర్తలతో లోకేష్ వ్యాఖ్యానించారు. త్వరలోనే తాను మంగళగిరిలో పర్యటించనున్నట్లు చెప్పారు. అయితే ఓటమికి కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దొని, ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుని మనకి పార్టీ అండగా ఉందని అన్నారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో లోకేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పుడే అందరూ రాంగ్ సెలక్షన్ అన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా అందరూ అదే అంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. అయినా సరే తాను మంగళగిరిని వీడేదిలేదని చెబుతున్నారు. చివరి వరకూ అదే మాటపై ఉంటారా? లేదా అన్నది వేచిచూడాల్సిందే.