Telugu Gateway
Politics

హరీష్ కు మళ్ళీ కీలక బాధ్యతలు అప్పగిస్తారా?

హరీష్ కు మళ్ళీ కీలక బాధ్యతలు అప్పగిస్తారా?
X

టీఆర్ఎస్ లో మాజీ మంత్రి హరీష్ రావుకు మళ్ళీ కీలక బాధ్యతలు అప్పగిస్తారా?. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ నేతల్లో హాట్ టాపిక్. లోక్ సభ ఎన్నికల బాధ్యతను టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ తన తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ కే అప్పగించారు. హరీష్ రావును ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారనే విమర్శలు విన్పించాయి. కెటీఆర్ లోక్ సభ ఎన్నికల సమయంలో హరీష్ రావుకు ఓ ఛాలెంజ్ విసిరారు. మెదక్ పార్లమెంట్ కంటే కరీంనగర్ లోక్ సభ సీటులో కనీసం కొన్ని ఓట్లు అయినా ఎక్కువ మెజారిటీ సాధించి చూపిస్తామని ప్రకటించారు. తీరా చూస్తే కరీంనగర్ సీటును టీఆర్ఎస్ దారుణంగా ఓడిపోగా..మెదక్ సీటును భారీ మెజారిటీతో టీఆర్ఎస్ దక్కించుకుంది. తన ఛాలెంజ్ లో కెటీఆర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కెటీఆర్ అన్నీ తానే అయి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం..ఇతర వ్యవహారాలను చూసుకున్నారు. కానీ ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. ఫలితాలను చూస్తే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని ఊహించని షాక్.

ఆ పార్టీ కంచుకోటలను ఎవరూ ఊహించని రీతిలో బిజెపి బద్దలు కొట్టింది. అంతే కాదు ..సారు..కారు..పదహారు నినాదంతో వెళ్లిన టీఆర్ఎస్ కు చాలా పరాభవాలు ఎదురయ్యాయి. ఏకంగా సీఎం కెసీఆర్ కుమార్తె, సిట్టింగ్ నిజామాబాద్ ఎంపీ కవిత ఓటమి పాలయ్యారు. ఈ సీటును బిజెపి తరపున పోటీ చేసిన అరవింద్ దక్కించుకున్నారు. ఇది టీఆర్ఎస్ కు ఊహించని షాక్. టీఆర్ఎస్ కంచుకోట అయిన కరీంనగర్ సిట్టింగ్ లోక్ సభ సీటును బిజెపి దక్కించుకుంది. ఇక్కడ నుంచి బిజెపి తరపున పోటీ చేసిన బండి సంజయ్ ఘన విజయం సాధించారు. ఆదిలాబాద్ సీటుతో పాటు సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిచిన జి. కిషన్ రెడ్డి కూడా విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలను చవిచూసిన బిజెపి ఎంపీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకోవటం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ ఏకంగా మూడు ఎంపీ సీట్లను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోక్ సభ సీటులో విజయం సాధించారు. రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి నుంచి, నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయ బావుటా ఎగరేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో హరీష్ రావుకు మంత్రి పదవితో పాటు తిరిగి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Next Story
Share it