Telugu Gateway
Telangana

ప్రతి రోజూ విదేశాలకు 71 వేల మంది భారతీయులు

ప్రతి రోజూ విదేశాలకు 71 వేల మంది భారతీయులు
X

ఒకప్పుడు విదేశాలకు వెళ్ళటం అంటే అది ఓ పెద్ద కలగా ఉండేది. కానీ ఇప్పుడు విదేశీ పర్యటన చాలా సాదాసీదా వ్యవహారంగా మారింది. అయితే దేశంలో ఇంకా ఒక్కసారి కూడా విమానం ఎక్కని వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. నిజంగా ఇప్పటికిప్పుడు దేశంలోని ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి విమానయాన చేయాలంటే కూడా ప్రస్తుతం దేశంలో ఉన్న విమానాలు..విమానాశ్రయాల వంటి మౌలికసదుపాయాలు ఏ మాత్రం సరిపోవు. అయితే గత కొంత కాలంగా దేశంలో విమానయాన రంగం వేగంగా పురోగమిస్తోంది. కాకపోతే 2019లో మాత్రం అది దెబ్బ తినే సూచనలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే జెట్ ఎయిర్ వేస్ మూసివేత..ఒక్కసారిగా రేట్ల పెరుగుదల వంటి అంశాలు ఈ ఏడాది దేశీయ విమానయాన రంగంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రతి రోజూ దేశం నుంచి 71 వేల మంది విదేశాలకు ఎగిరిపోతున్నారు. 2015-2018 సంవత్సరాల మధ్య కాలంలో రైలు ప్రయాణంతో పోలిస్తే విమాన ప్రయాణ వృద్ధి రేటు ఎనిమిది రెట్లు పెరిగింది. ప్రపంచంలోనే అతి వేగంగా వృద్ధి చెందుతున్న విమానయాన రంగాల్లో భారత్ ఒకటిగా ఉంది. గత పదేళ్ళ కాలంలో దేశంలో కొత్తగా 10 విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయి.

ఇదిలా ఉంటే దేశీయ పర్యాటకులు తమ ఖర్చులో ఎక్కువ భాగం షాపింగ్ పైనే చేస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. తర్వాత ఖర్చు ఆహారంపై ఉండగా..రిక్రియేషన్ పై మాత్రం 20 శాతమే వ్యయం చేస్తున్నారు. పర్యాటకుల్లో చాలా మంది ఒక్కసారి అయినా విదేశీ పర్యటన చేయాలని బలంగా కోరుకుంటున్నారు. దీనికి పలు బ్యాంకులు..క్రెడిట్ కార్డులపై నెల వారీ వాయిదాల పద్దతి కూడా ప్రవేశపెట్టడం కలసి వస్తోంది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు..ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే కొత్త వారితో పోలిస్తే దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల్లో పదే పదే ప్రయాణించే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుందని సమాచారం. అదే సమయంలో కొత్త వారి సంఖ్యలో పెరుగుదల కూడా ఓ మోస్తరుగా ఉందని చెబుతున్నారు.

Next Story
Share it