ఈసీ వివాదస్పద నిర్ణయం
కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఈ సారి ఎన్నికల నిర్వహణలో ఎప్పుడూలేనంతగా తీవ్ర విమర్శల పాలైంది. ఎన్నికలు పూర్తయి..మరో వారం రోజుల్లో కౌంటింగ్ జరగనున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పుడు రీ పోలింగ్ జరపాలని నిర్ణయించటం కలకలం రేపుతోంది. సహజంగా ఎన్నికలు పూర్తయిన వెంటనే ఎక్కడెక్కడ రీపోలింగ్ అవసరం ఉంది?. తదితర సమాచారం సీఈసీకి పంపుతారు. సీఈసీ ఆదేశాల మేరకు ఏపీలో రీపోలింగ్ కూడా పూర్తయింది. కానీ సడన్ గా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు బూత్ ల్లో రీపోలింగ్ కు ఆదేశించటంతో అధికార టీడీపీ మండిపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలుకుని ఆ పార్టీ నేతలు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభ్యర్ధి ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజే ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఈసీ..వైసీపీ అభ్యర్ధి ఇచ్చిన పిర్యాదుపై ఆగమేఘాల మీద స్పందించి రీపోలింగ్ కు ఆదేశించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
రీ పోలింగ్ నిర్ణయంపై టీడీపీ శ్రేణులు గురువారం ఉదయం పెద్ద ఎత్తున తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశాలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్‌ఆర్ కమ్మపల్లి (పోలింగ్ స్టేషన్ 321), పుల్లివర్తిపల్లి (104), కొత్త కండ్రిగ (316), కమ్మపల్లి (318), వెంకటాపురం (313) పోలింగ్ స్టేషన్లలో పార్లమెంట్, శాసనసభలకు ఈ నెల 19న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అధికార తెలుగుదేశం పార్టీ ఈ అయిదు బూత్‌ల్లోకి ఇతరులను లోనికి రానీకుండా రిగ్గింగ్ చేశారంటూ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై మరోసారి ఈసీతో ఘర్షణకు దిగటానికి టీడీపీ రెడీ అయింది.