Telugu Gateway
Telangana

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కలు

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కలు
X

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా ఇది ఖమ్మం జిల్లాలోనే ఎక్కువగా ఉంది. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్ పై రాళ్ళు..చెప్పుల దాడి ఘటన జరిగిన వెంటనే మరో ఘటన చోటుచేసుకుంది. పార్టీ మారి అధికార టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును ప్రజలు నిలదీశారు. ఇందులో ఓట్లు వేసి గెలిపించిన కాంగ్రెస్ నాయకులు..శ్రేణుల పాత్ర కూడా కీలకంగా మారింది. బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంలో రేగా కాంతారావు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ తరపున ప్రచారానికి వచ్చారు. అక్కడే కొంత మంది ప్రజలు కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి టీఆర్ఎస్ లోకి ఎలా వెళ్ళారని ప్రశ్నించారు. పైగా టీఆర్ఎస్ తరపున ఎలా ప్రచారం చేస్తారంటూ నిలదీశారు.

దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఓ పార్టీపై గెలిచి మరో పార్టీలో చేరటంపై ఆ ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక రేగా కాంతారావు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై సుజాత నగర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ బీఫారంపై గెలిచి పార్టీ మారిన వనమాపై ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేయాలని స్థానిక కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇదే రీతిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నేతలు పిలుపు ఇవ్వటంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు బయట తిరగటం పెద్ద సమస్యగా మారింది.

Next Story
Share it