సీఎస్ చంద్రబాబు కింద పనిచేయాలా?
‘ఏదైనా మాట్లాడటానికి ఆయన స్వతంత్రుడు కాదు. నా కింద, ఈసీ కింద పనిచేయాలి. రోజువారి పాలనా వ్యవహారాలను నాకు వివరించాలి’. ఇదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు. ప్రభుత్వం అంటే ఓ ఉమ్మడి బాధ్యత. సీఎం, మంత్రివర్గం, అధికారులు..ఉద్యోగులు అందరూ కలసి పనిచేస్తేనే ప్రభుత్వం అవుతుంది. అంతే కానీ సీఎస్ చంద్రబాబు కింద పనిచేయటం. మరొకరు ఇంకొరి కింద పనిచేయటం అంటూ ఉండదు. ముఖ్యమంత్రి పదవి హోదా పరంగా అత్యున్నతమైన పదవి. అంతమాత్రాన ఆయన నేరుగా ఏ ఆదేశాలు జారీ చేయలేరు. ఆయన చెప్పే ఏ ఆదేశాలు బయటకు రావాలన్నా దానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా శాఖల కార్యదర్శుల ఆదేశాలు తప్పనిసరి. వాళ్ల సంతకం ఉంటేనే సీఎం ఆదేశాలతో కూడిన అంశం ఏదైనా సరే జీవో రూపంలో బయటకు వస్తుంది. అంత మాత్రాన అధికారులు..తాము గొప్పవాళ్ళు అనుకుంటే సరిపోతుందా?.
ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా ఉన్నతాధికారులు తిరస్కరించిన సందర్భాలు ఎన్నో. అవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు. సీఎం నిర్ణయాలను సీఎస్ లు తీవ్రంగా వ్యతిరేకించారు కూడా. అలాంటి అడ్డగోలు నిర్ణయాలను చంద్రబాబునాయుడు సర్కారు ఈ ఐదేళ్ళలో ఎన్నో మంత్రివర్గంలో పెట్టి ఆమోదించుకుంది. మరి చంద్రబాబునాయుడు చెబుతున్నట్లు సీఎస్ ఆయన కింద పనిచేస్తే ఆయన ఏది చెపితే అదే చేయాలి కదా?. అందుకు భిన్నంగా గత సీఎస్ లు ఎందుకు వ్యవహరించారు. సీఎస్ తోపాటు అధికారులు ఆయన కింద పనిచేయటానికి ఇది ప్రభుత్వమా? లేక హెరిటెజ్ ఫుడ్స్ కంపెనీయా? అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. సీఎస్ తోపాటు అధికారుల విషయంలో చంద్రబాబు గత కొంత కాలంగా వ్యవహరిస్తున్న తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ఆయన ఆక్షేపించారు.