Telugu Gateway
Politics

లోకేష్ కోసం కూడా చంద్రబాబు ఇంతలా కష్టపడలా!

లోకేష్ కోసం కూడా చంద్రబాబు ఇంతలా కష్టపడలా!
X

మంగళగిరిలో నారా లోకేష్ గెలుపు కోసం కూడా తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంత ఫోకస్ పెట్టలేదు. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోసం చంద్రబాబునాయుడు పడుతున్న తపన చూస్తున్న వారందరికీ ఇది ఆశ్చర్యం కలిగిస్తోంది. 2014 ఎన్నికల ముందు అవినీతి కాంగ్రెస్, అక్రమాల కాంగ్రెస్, ఏపీని విభజించిన కాంగ్రెస్ ను దేశం నుంచి పారదోలాలని మోడీతో కలసి ప్రచారం చేశారు. అదే 2019 ఎన్నికలు వచ్చేసరికి దేశానికి కొత్త ప్రధాని ఎవరైనా ఓకే. మోడీ తప్ప అనే నినాదాన్ని అందుకున్నారు. ఐదేళ్లకు ఓ సారి చంద్రబాబు ‘నినాదం’ మారుతుంటుంది. అది పూర్తిగా అవకాశవాద రాజకీయాలు తప్ప..ఓ సిద్ధాంతం కోసమో..విలువల కోసమో ఏ మాత్రం కాదు. ఇప్పటి విషయానికి వస్తే రాహుల్ గాంధీ కంటే చంద్రబాబునాయుడే ఎక్కువగా ఆయన్ను ప్రధాని చేయాలని తలపోస్తున్నట్లు కన్పిస్తోంది. ఆదమరిస్తే మోడీ అన్ని పక్షాలను తనవైపు తిప్పుకుంటారని..అందుకే అప్రమత్తంగా ఉండి మోడీకి దూరంగా ఉండాలని చెబుతున్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ఫలితాలు వచ్చిన తర్వాత చూసుకుందాం అని చెబుతోంది. కానీ చంద్రబాబు మాత్రం పదే పదే రాహుల్ గాంధీతో భేటీ అయి..ఎన్నికల ఫలితాల అనంతరం అమలు చేయాలస్సిన వ్యూహాలు..చేపట్టాల్సిన చర్యలపై సలహాలు..సూచనలు ఇస్తున్నారు.

వందేళ్ళకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ లో చంద్రబాబు తప్ప..ఉత్తరప్రదేశ్ కు చెందిన మాయావతి, అఖిలేష్ లతో మాట్లాడేవారే లేరా?. కాంగ్రెస్ అడగకపోయినా చంద్రబాబు ఈ స్వయం సేవ ఎందుకు చేస్తున్నట్లు?. అంటే చంద్రబాబు భయాలు చంద్రబాబుకు ఉన్నాయి. తన సురక్షిత భవిష్యత్ కోసం ఆ మాత్రం కష్టపడితే తప్పుపట్టాల్సి ఏముంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఏపీలో అధికారం కోల్పోయి..కేంద్రంలో మళ్ళీ మోడీ వస్తే తన పరిస్థితి ఏంటి అనే భయమే చంద్రబాబులో ఎక్కువ ఉందని టీడీపీ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకే అడగకపోయినా రాహుల్ గాంధీ కోసం చంద్రబాబు ఉచిత సేవలు కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తే ‘సేఫ్’గా ఉండొచ్చన్నది చంద్రబాబు ప్లాన్.

Next Story
Share it