Telugu Gateway
Politics

చంద్రబాబు ‘రెండు పడవల ప్రయాణం’!

చంద్రబాబు ‘రెండు పడవల ప్రయాణం’!
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘రెండు పడవ’ల ప్రయాణం చేస్తున్నారా?. అంటే ఔననే చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. ఇప్పుడు చంద్రబాబు ఏకంగా కాంగ్రెస్ కంటే ఎక్కువగా ఆ పార్టీ తరపున ‘లాబీయింగ్’ చేస్తున్నారు. ఇది బయటకు కన్పిస్తున్న విషయం. మోడీని మరోసారి ప్రధాని పీఠంపై కూర్చోకుండా చూడటమే లక్ష్యంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఆయన మళ్ళీ మోడీ కేంద్రంలోకి రావటం అనివార్యం అయితే ఆయనతో కలసి పోయేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మీడియా అధినేతతో జరిగిన భేటీ ప్రధాన ఉద్దేశం ఇదే అని టీడీపీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు రాజకీయ భవిష్యత్ కు ఇది ఎంతో కీలక సమయంగా మారింది. కేంద్రంలో మళ్ళీ మోడీ వచ్చి..ఏపీలో టీడీపీ గెలిచినా చంద్రబాబుకు కష్టాలే. ఏపీలో చంద్రబాబు ఓడిపోయి కేంద్రంలో మోడీ వచ్చినా సమస్యలే. అందుకే ఆయన రెండు పడవల ప్రయాణానికి అవసరమైన వ్యూహరచన...మీడియాపరంగా సాయం కోసమే ఈ భేటీ జరిగినట్లు టీడీపీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏపీలో జగన్ కే ఛాన్స్ ఉందని బలంగా ప్రచారం జరుగుతోంది. కనీసం కేంద్రంలో తన ప్రయత్నాల ద్వారా కాంగ్రెస్ సాయంతో కొత్త ప్రభుత్వ్ కొలువుదీరితే తనకు కొంత లో కొంత అయినా మాట చెల్లుబాటు అవుతుందని..చిక్కులు రాకుండా చూసుకోవచ్చన్నది చంద్రబాబు ప్లాన్.

ఇవన్నీ కూడా మే 23న వెలువడే ఫలితాల నెంబర్ల ఆధారంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఏపీలో చంద్రబాబు కంటే జగన్ కు ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే సహజంగా ఎక్కువ సీట్లు ఉన్న వారి మాటకే విలువ ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా కాకుండా చూసుకోవటమే లక్ష్యంగా తాజా సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం ఏదైనా కేంద్ర సాయం ఉదారంగా లేకపోతే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కంటే ముందు వ్యక్తిగతం...పార్టీపరంగా కష్టాలు పడకుండా చూసుకోవాలంటే కేంద్రంలో ఎవరు ఉంటే వారితో సఖ్యతగా ఉండాల్సిన పరిస్థితి. అందుకే ఓ వైపు కాంగ్రెస్ కోసం కష్టపడుతూనే మరోవైపు..బిజెపికి స్నేహహస్తం అందించే సన్నాహాలు ఉన్నారు. ఇక్కడ కూడా చంద్రబాబు తన ‘రెండు కళ్ల’ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారని ఓ నేత చమత్కరించారు.

Next Story
Share it