Telugu Gateway
Politics

చంద్రబాబు అసలేం మారలేదు!

చంద్రబాబు అసలేం మారలేదు!
X

ఏం మారలేదు. చంద్రబాబు అసలేం మారలేదు. ఇది టీడీపీ నేతల వాదన. 2014 ముందు అధికారంలోకి రాక ముందు చెప్పిన మాటలే...ఐదేళ్ళ అధికారం తర్వాత కూడా చెబుతున్నారా?.. అంటే ఔననే చెబుతున్నారు టీడీపీ నేతలు. పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు ఇవే మాటలు చెప్పేవారు. ‘అధికారంలో ఉన్నప్పుడు పార్టీని కొంత నిర్లక్ష్యం చేశా. ఈ సారి ఆ తప్పు చేయను. పార్టీకి సమయం ఇస్తా. మళ్ళీ అధికారంలోకి వస్తే మారిన చంద్రబాబును చూస్తారు. గతంలో అధికారులకే ఎక్కువ సమయం ఇఛ్చేవాడిని. ఆ తప్పులు ఈ సారి పునరావృతం కానివ్వను.’ అని పదే పదే చెప్పారు. టీడీపీ నాయకులు..క్యాడర్ అందరూ నిజమే అని నమ్మారు. 2014లో చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అక్కరకు వస్తుందని ప్రజలు కూడా ఓటేశారు. కానీ ఐదేళ్ల పాలన తర్వాత కూడా తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘సేమ్ క్యాసెట్’ రిపిట్ చేస్తున్నారు. ఈ ఐదేళ్ళు కొత్త రాష్ట్రం కాబట్టి పాలనపై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఈ సారి వస్తే మాత్రం పార్టీకే ఎక్కువ సమయం కేటాయిస్తా. నేతల సలహాలు..సూచనలు తీసుకుంటూ అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే చెప్పారో..ఇప్పుడు కూడా అదే చెబుతున్నారు.

టీడీపీ నేతల్లో చంద్రబాబు తీరుపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. గతానికి భిన్నంగా ఈ సారి చంద్రబాబు తన అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించలేని పరిస్థితికి చేరుకున్నారని చెబుతున్నారు. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు మొదలుకుని..నేతల వరకూ ఎవరి మాటకు పెద్దగా విలువ ఇవ్వలేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కొత్త రాష్ట్రంపై ఫోకస్ పెట్టి..పార్టీకి సమయం ఇవ్వలేదనటంలో కూడా ఏ మాత్రం హేతుబద్దత లేదని..తాను..తన వర్గం వారు నిత్యం ఎలా లాభపడాలనే అంశాలపై ఫోకస్ తప్ప..కనీసం శాశ్వత రాజధానికి సంబంధించి రెండు, భవనాలను పూర్తి చేసినా ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేదికాదని చెబుతున్నారు. పార్టీ నేతలకు సమయం ఇస్తా అని చెబుతున్న చంద్రబాబు..గత ఐదేళ్ల కాలంలో సొంత పార్టీ నాయకులను కాదని..ఫిరాయింపు నేతలతో పార్టీని నింపేయటంతోపాటు..వారికి కీలక పదవులు ఇఛ్చి టీడీపీనే నమ్ముకున్న వారికి ఎంతో మందికి అన్యాయం చేశారని ఓ నేత వ్యాఖ్యానించారు. మళ్ళీ ఇప్పుడు కూడా చంద్రబాబు పాత క్యాసెట్ వేస్తే ఎవరు నమ్ముతారని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఫలితాల తర్వాత కానీ సీనియర్ నేతలు చంద్రబాబు ముందే అసలు విషయాలు కుండబద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నారని ఓ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it