Telugu Gateway
Politics

తెలుగుదేశం శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక

తెలుగుదేశం శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక
X

తెలుగుదేశం శాసనసభాపక్షం చంద్రబాబునాయుడిని తమ పార్టీ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. బుధవారం నాడు చంద్రబాబునాయుడు నివాసంలో ఈ సమావేశం జరిగింది. టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబును పార్టీ ఎమ్మెల్యేలు..ఎంపీలు అభినందించారు. గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 175 సీట్లకు గాను ఈ సారి టీడీపీ కేవలం 23 సీట్లను మాత్రమే దక్కించుకుంది. ఈ తరుణంలో అంటే ఇంత తక్కువ సీట్లు ఉన్నప్పుడు చంద్రబాబు శాసనసభాపక్ష నేతగా వ్యవహరిస్తారా? లేక ఈ బాధ్యతలు ఎవరికైనా అప్పగిస్తారా? అన్న చర్చ జరిగింది. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ చంద్రబాబే ప్రతిపక్ష బాధ్యతలు చేపట్టానికి రెడీ అయ్యారు.

అసెంబ్లీలో భారీ మెజారిటీతో ఉన్న వైసీపీని ఎదుర్కోవటం టీడీపీకి అంత తేలికైన అంశం కాదు. అంతే కాదు గత ఐదేళ్ల పాలనలో చేసిన అక్రమాలు..అవినీతి వంటి అంశాలు టీడీపీని వెంటాడనున్నాయి. ఇఫ్పటికే కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ వ్యవహారాలపై జ్యుడిషియల్ కమిటీ వేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు. అయితే చంద్రబాబు కూడా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దూకుడు తగ్గించి..కొంత కాలం వేచిచూడాలనే యోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన ఇదే సంకేతాలను పంపుతున్నారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలు రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it