Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ‘రాహుల్ రాజకీయ సలహాదారు’గా మారారా?

చంద్రబాబు ‘రాహుల్ రాజకీయ సలహాదారు’గా మారారా?
X

ఒకప్పుడు కాంగ్రెస్, టీడీపీ అంటే ఉప్పు..నిప్పు. అసలు టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతపై. ఏపీని విభజన చేసినప్పుడు కూడా తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కాంగ్రెస్ పార్టీ ఓ భయంకరమైన..దుర్మార్గమైన పార్టీగా కన్పించింది. కానీ ఇప్పుడు అది ఓ ‘అత్మీయ పార్టీ’గా మారిపోయింది. ఎందుకంటే ఆయన అవసరం అలాంటిది. ఇప్పుడు చంద్రబాబునాయుడు ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ‘రాజకీయ సలహాదారు’గా మారిపోయారనే చర్చ తెలుగుదేశం పార్టీలోనే సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కెవీపీ వంటి నేతలకు ఇది ఏ మాత్రం మింగుడు పడటం లేదు. మోడీ ఓటమిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏ మేరకు కోరుకుంటున్నారో తెలియదు కానీ..కానీ చంద్రబాబు మాత్రం అత్యంత బలంగా మోడీ ఓటమిని కోరుకుంటున్నారు?. ఎందుకంటే మళ్ళీ మోడీ ప్రధాని సీటులో కూర్చుంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చంద్రబాబుకు బాగా తెలుసు?.

ఏపీలో అధికారం పోయినా..ఉన్నా కూడా ఢిల్లీలో ప్రధానిగా మోడీ వస్తే మాత్రం చంద్రబాబుకు చిక్కులు తప్పవనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లోనే బలంగా ఉంది. అందుకే ఆయన రాహుల్ గాంధీ కంటే బలంగా మోడీ ఓటమిని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు రాహుల్ కు అవసరానికి అనుగుణంగా రాజకీయాలు ఎలా చేయాలో సూచనలు ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన రెండు దశల పోలింగ్ పూర్తయిన వెంటనే గెలుపు అవకాశాల ఆధారంగా ఆయా పార్టీలతో ముందుగానే టచ్ లోకి వెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి అవసరం అయితే ‘కర్ణాటక ఫార్ములా’ను కూడా సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మోడీని ప్రధాని పదవికి దూరం చేయటానికి కాంగ్రెస్ మద్దతుతో అందరికి ఆమోదయోగ్యమైన నేతను ప్రధానిగా ఎంపిక చేయటం ఒకటి. అందుకే ఆయన బుధవారం నాటి రాహుల్ భేటీలో ఓ నివేదిక అందజేశారు. ఇందులో విశేషం ఏమింటే టీడీపీకీ 17 ఎంపీ సీట్లు, వైసీపీకి 8 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని తన నివేదికలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

పలు సర్వేలు వైసీపీకి 20 నుంచి 22 ఎంపీల వరకూ ఛాన్స్ ఉందని చెబుతుంటే..చంద్రబాబు మాత్రం టీడీపీ కోటాలో ఏకంగా 17 ఎంపీ సీట్లు రాహుల్ కి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. అన్నింటి కంటే మరో విశేషం ఏమిటంటే తెలంగాణలో టీఆర్ఎస్ కు 14 ఎంపీ సీట్లు..కాంగ్రెస్ కు రెండు ఎంపీ సీట్లు వస్తాయని చంద్రబాబు నివేదించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఎస్పీ, బిఎస్పీకి కలపి 46 సీట్లు వస్తాయన్నది చంద్రబాబు అంచనా. ఇలా అన్ని రాష్ట్రాలకు చెందిన జాబితాలు అందజేసి...ఎన్నికలు పూర్తయిన వెంటనే రంగంలోకి దిగాలని ప్రణాళికను రాహుల్ కు నిర్దేశించినట్లు చెబుతున్నారు. చూడాలి చంద్రబాబు, రాహుల్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో.

Next Story
Share it