కరీంనగర్ ఎంపీ సీటు బిజెపిదే..ఇండియా టుడే

ప్రముఖ జాతీయ ఛానల్ ఇండియా టుడే తెలంగాణ లోక్ సభకు సంబంధించి ఆసక్తికర అంచనాలను వెల్లడించింది. కరీంనగర్ లోక్ సభ సీటును బిజెపి గెలుచుకోబోతుందని ఇండియా టుడే పేర్కొంది. సీట్ల వారీగా ఏ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉంది. ఏ పార్టీ ఏ సీట్లను గెలుచుకోబోతుందనే విషయాన్ని తన వెబ్ సైట్ లో పేర్కొంది. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల వారీగా ఈ వివరాలు వెల్లడించింది. తెలంగాణకు సంబంధించి పలు అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కరీంనగర్ సీటును బిజెపి గెలుచుకుంటుందని చెబుతూనే తెలంగాణ సీఎం కెసీఆర్ కుమార్తె, ప్రస్తుత ఎంపీ కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ నియోజకవర్గంలో పోటీ చాలా తీవ్రంగా ఉందని పేర్కొంది. టీఆర్ఎస్, బిజెపిల మధ్య పోటీ గట్టిగా ఉందని పేర్కొంది. నల్లగొండ ఎంపీ సీటును కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ పేర్కొంది.ఇక్కడ నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్న విషయం తెలిసిందే.
తెలంగాణ ఫలితాలకు వచ్చే సరికి మరో ఆసక్తికర పరిణామం ఉంది. ఆదిలాబాద్ లోక్ సభలో ప్రధానంగా పోటీ బిజెపి, కాంగ్రెస్ ల మధ్య ఉంది. అధికార టీఆర్ఎస్ అసలు పోటీలోనే లేనట్లు ఇండియా టుడే పేర్కొనటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.భువనగిరిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య తీవ్ర పోటీ ఉందని వెల్లడించింది. మరో కీలకమైన సీటు చేవేళ్లలోనూ టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పోటీ తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ సీటును టీఆర్ఎస్ దక్కించుకుంటుందని ఇండియా టుడే వెల్లడించింది. అందరూ బిజెపికి ఛాన్స్ ఉంటుందని భావించిన సికింద్రాబాద్ సీటును కూడా ఇండియా టుడే టీఆర్ఎస్ ఖాతాలోనే వేసింది. మహబూబాబాద్ లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య పోటీ తీవ్రంగా ఉందని తెలిపింది. మహబూబ్ నగర్ సీటు ను కూడా టీఆర్ఎస్ ఖాతాలో వేశారు. మల్కాజ్ గిరి సీటును కూడా టీఆర్ఎస్ గెలుచుకుంటుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సీట్ల వారీ లెక్కల్లో చూపించింది. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో కనీసం గట్టి పోటీ ఉందని కూడా చెప్పకపోవటం విశేషం.