ఫిరాయింపు ఎమ్మెల్యేపై రాళ్ళ దాడి

తెలంగాణలో ఫిరాయింపుల వ్యవహారాన్ని కార్యకర్తలు కొన్ని చోట్ల చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఆ ప్రభావం ఎక్కువగా ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల వాహనాలపై పలు చోట్ల కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. శనివారం నాడు ఖమ్మం జిల్లాలో అలాంటిదే మరో ఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియపై అలాంటి దాడే జరిగింది. ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ ఎంపీటీసీ తరపున ప్రచారానికి వచ్చారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెపై చెప్పులు..రాళ్ళు విసిరేశారు. ఈ వ్యవహారం పెద్ద కలకలం రేపింది. అయితే కాంగ్రెస్ కార్యకర్తల దాడితో టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ప్రతిదాడికి దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని గోవింద్రాలతో ఈ ఘటన చోటు చేసుకుంది.
టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్ధి సునీతకు మద్దతుగా ఎమ్మెల్యే హరిప్రియ ప్రచారానికి వెళ్ళారు. దాడుల ఘటనతో హరిప్రియ తన ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకుని వెనక్కి వెళ్ళారు. గత ఎన్నికల సమయంలో తాము చెమటోడ్చి ఆమె గెలుపునకు పనిచేశామని..ఇదేమీ పట్టించుకోకుండా ఆమె పార్టీ ఎలా మారతారని కొంత మంది ప్రశ్నించారు. ఆమె పార్టీ మారటాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తప్పుపట్టారు. ఈ రాళ్ళు..చెప్పుల దాడిలో కొంత మందికి గాయాలు అయ్యాయి. ప్రజలు ఎక్కువగా ఉండటం..పోలీసులు పరిమిత సంఖ్యలో ఉండటంతో ఈ దాడులను నియంత్రించటంతో తొలుత కష్టంగా మారింది. తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.