Telugu Gateway
Andhra Pradesh

వెల్ కం జగన్ ..బై బై బాబు అన్న ఏపీ

వెల్ కం జగన్ ..బై బై బాబు అన్న ఏపీ
X

వైసీపీ నినాదం బై బై బాబును ఏపీ ప్రజలు ఆమోదించారు. అదే సమయంలో జగన్ కు వెల్ కం చెప్పారు. వైసీపీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి సారి మిస్ సీఎం సీటు..రెండవ సారి జగన్ పరమైంది. దీంతో ఏపీలో వైసీపీ సర్కారుకు మార్గం సుగమం అయింది. ఫలితాల అనంతరం మాట్లాడుతూ జగన్ ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో ప్రజలతో ‘మంచి సీఎం’ అన్పించుకుంటా అని ప్రకటించారు. సర్వే అంచనాలు...చాలా వరకూ ఎపీలో ఎగ్జిట్ పోల్స్ నిజం అయినా కూడా ఈ తరహా ఫలితాలను మాత్రం ఎవరూ ఊహించలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే జగన్ కు ఏకంగా 151 సీట్లు దక్కాయి. అధికార టీడీపీ కేవలం 23 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లోక్ సభ సీట్లలోనూ ఇదే ట్రెండ్. వైసీపీ ఏకంగా 22 ఎంపీ సీట్లను గెలుచుకోగా..టీడీపీ 3 సీట్లతో సర్దుకుంది. మొత్తం మీద ఏపీ ప్రజలు వైఎస్సార్‌సీపీకి మూడింట రెండొంతుల మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారు. 37 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఆ పా ర్టీ చరిత్రలో ఇదే దారుణ ఓటమిగా నమోదు అయింది. జగన్ సునామీలో 19 మంది మంత్రులు, స్పీకర్, చీఫ్‌ విప్, విప్‌లతోసహా ఆ పార్టీ కీలక నేతలు అందరూ ఓటమి పాలయ్యారు.

రాజకీయాల్లో మార్పు కోసం అంటూ వచ్చిన జనసేన అత్యంత పేలవ పదర్శన చూపించింది. రెండు చోట్ల పోటీచేసిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు దేశ వ్యాప్తంగా గురువారం జరిగిన విషయం తెలిసిందే. పోస్టల్‌ బ్యాలెట్‌ల దగ్గర నుంచే వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఈవీఎంలు తెరిచినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం మొదలైంది. ఏ రౌండ్ లోనూ టీడీపీ అసలు ముందు వరసలోకి రాలేకపోయింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా–గుంటూరు, నెల్లూరు– ప్రకాశం, రాయలసీమ... ఇలా ప్రాంతం ఏదైనా ఫలితం ఒక్కటే. అసెంబ్లీ నియోజకవర్గమైనా, లోక్‌సభ నియోజకవర్గమైనా ఫలితంలో తేడా లేదు. రాష్ట్ర మంతటా జగన్‌ నాయకత్వానికే ప్రజలు తిరుగులేని విజయాన్ని అందించారు.

వైఎస్సార్ కడప, నెల్లూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అన్ని అసెంబ్లీ, ఎంపీ నియోజకవర్గాల్లో గెలిచి వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసి పెను సంచలనం సృష్టించింది. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 28 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఉభయగోదా వరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాలకు గాను 27 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 33 నియోజకవర్గాల్లో 29 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 22 అసెంబ్లీ స్థానాలకు గాను 18 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. రాయలసీమలో వైఎస్సార్‌సీపీ జైత్రయాత్ర కొనసాగించింది. సీమ పరిధిలోని నాలుగు జిల్లాల్లోని 52 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 49 సీట్లలో అఖండ విజయం సాధించింది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని ఒక్క కుప్పం మినహా మిగిలిన 13 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. టీడీపీ బలంగా ఉం దని భావించే అనంతపురం జిల్లా లోని 14 స్థానాలకు గాను 12 సీట్ల ను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది.

Next Story
Share it