Telugu Gateway
Politics

వీవీప్యాట్ లే ముందు లెక్కించాలి

వీవీప్యాట్ లే ముందు లెక్కించాలి
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు ఓ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ముందు వీవీప్యాట్ లు లెక్కించాకే ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించాలని కోరుతున్నారు. ఎలాగైనా పెద్ద తేడా ఏమీ ఉండదు. వీవీప్యాట్ లు..ఈవీఎంల మధ్య ఓట్ల విషయంలో తేడా వస్తే మొత్తం వీవీప్యాట్ లను లెక్కించాలనే డిమాండ్ ఒకింత సహేతుకమైనదే. అయితే అంతిమంగా వీవీప్యాట్ ల లెక్కలనే తుది లెక్కలుగా పరిగణిస్తామని ఎన్నికల కమిషన్ ఇఫ్పటికే ప్రకటించింది. అయినా సరే చంద్రబాబు మాత్రం ఇదే నినాదంతో రోజూ కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలుస్తున్నారు. మొత్తం వీవీప్యాట్ స్లిప్ లను లెక్కించడంలో ఎన్నికల కమిషన్ కు ఉన్న సమస్య ఏమిటని ఆయన అన్నారు. పోలింగ్‌లో పారదర్శకత, ప్రజల్లో విశ్వసనీయత కల్పించడం ఈసీ బాధ్యత అన్నారు. రాజకీయ పార్టీలన్నీ లేవనెత్తిన సమస్యలేవీ చిన్నవి కాదని, వెంటనే పరిష్కరించకపోతే పెద్దవి అవుతాయని ఆయన పేర్కొన్నారు.

ప్రతి నియోజకవర్గంలోని ఐదు బూత్ ల వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపులో ఏమైనా సమస్యలు ఎదురైతే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఈసీకి ఉన్న అభ్యంతరమేంటి? గత కొన్ని రోజులుగా ఈవీఎంల పనితీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. బాధ్యత గల రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మేం పోరాడుతున్నాం. ఒక్క రక్త పరీక్షతో శరీరంలో ఉన్న జబ్బు బయటపడదు. మొత్తం స్కానింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా అలాంటిదే అని చంద్రబాబు అన్నారు. పలు పార్టీల నేతలతో కలసి చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో సమావేశం అయ్యారు.

Next Story
Share it