Telugu Gateway
Politics

టీటీడీ బంగారం తరలింపుపై విచారణకు సీఎస్ ఆదేశం

టీటీడీ బంగారం తరలింపుపై విచారణకు సీఎస్ ఆదేశం
X

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బంగారం అయితే మాత్రం అంత లెక్కలేని తనమా?. ఓ డొక్కు వ్యాన్ లో ఏ మాత్రం భద్రతా చర్యలు లేకుండా కిలోల కొద్దీ బంగారాన్ని అలా తరలించేస్తారా?. కోట్లాది మంది భక్తులు కొలిచే వేంకటేశ్వరస్వామికి భక్తులు ఇచ్చిన కానుకల బంగారం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదీ ఎన్నికల సమయంలో అంత అలవోకగా..ఏ మాత్రం భద్రతా చర్యలు..సరైన పత్రాలు లేకుండా ఎలా అంత మొత్తం స్వేచ్చగా తరలించగలిగారు?. ఇవే ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఓ స్వామిజీ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ సారి చంద్రబాబు జమానాలో టీటీడీ పలు వివాదాల్లో చిక్కుకుంది. పవిత్రమైన దేవాలయాన్ని రాజకీయాలకు వాడుకోవటం ఇందుకు కారణం అయింది. టీటీడీదిగా చెబుతున్న బంగారానికి సంబంధించి ఆదివారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అసలు 1381 కిలోల బంగారం సంగతి ఏంటో తేల్చాలని విచారణకు ఆదేశించారు. ఈ బాధ్యతను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ కు అప్పగించారు. ఆయన స్వయంగా తిరుమల వెళ్ళి బంగారం రవాణాలో భద్రతా లోపాలపై విచారణ జరిపి సర్కారుకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఈ నెల 23లోగానే. ఈ మేరకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. చెన్నయ్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 1381 కిలోల బంగారాన్ని తరలిస్తుండగా..ఎన్నికల తనిఖీల్లో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ బంగారం తరలింపులో టీటీడీ విజిలెన్స్ విభాగం వైఫల్యాలు ఉన్నాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పుడు సీఎస్ నియమించిన కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందో వేచిచూడాల్సిందే. ఇందులో ఎన్ని విషయాలు బయటపడతాయో అన్న టెన్షన్ అందరిలో ఉంది.

నాలుగు వందల కోట్ల రూపాయల విలువ చేసే బంగారం నలుగురు వ్యక్తులు తీసుకువెళ్లడం వెనక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ బంగారం విషయంపై మొదట టీటీడీ ఈవోను ప్రశ్నించగా తనకేమీ తెలియదనంతో మరింత అనుమానం పెరిగింది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, టీటీడీ అధికారుల ఉత్సాహం వెనక పెద్ద స్కాం ఉందని రాజకీయ నాయకులు, పీఠాధిపతులు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. చెన్నైలో ఎన్నికల అధికారులు సీజ్‌ చేసిన 1381 కేజీల బంగారం చివరికి టీటీడీకి చెందినదిగా గుర్తించారు. రూ.50 లక్షలకు మించితే బ్యాంకు సెక్యూరిటీతో పాటు పోలీస్‌ భద్రత తప్పనిసరి అని నిబంధనలు చెబుతున్నాయి. కానీ కనీస భద్రత లేకుండా, ఆధారాలు లేకుండా ఎలా తీసుకెళ్లారని టీటీడీ మాజీ సభ్యుడు భాను ప్రకాశ్‌ ప్రశ్నిస్తున్నారు.

Next Story
Share it