ప్రతికూలతల్లోనూ ఫలితాలు సాధించిన కెసీఆర్

ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా పద్దెనిమిది సంవత్సరాల క్రితం పుట్టిన టీఆర్ఎస్ అనుకున్న లక్ష్యాన్ని ఎన్నో అడ్డంకుల మధ్య సాధించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ వ్యాఖ్యానించారు. శనివారం నాడు టీఆర్ఎస్ భవన్ లో అత్యంత సాదాసీదాగా పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఒకప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్..2014 ఎన్నికల్లో గెలుపు ద్వారా రాజకీయ పార్టీగా మారిందని అన్నారు. తెలంగాణ సాధించటంతోపాటు...సుపరిపాలన అందించటం ద్వారా దేశంలోనే పలు రంగాల్లో అగ్రగామిని నిలిచిందని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో సైనికుల్లా పని చేసిన కార్యకర్తలకు పేరుపేరునా అభినందనలు తెలిపారు కెటీఆర్. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కెసీఆర్ అనుమతి తీసుకుని మరో సారి ఆవిర్భావ వేడుకలు జరుపుకుందామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమాన్ని 2001లో కేసీఆర్ ఒంటరిగా మొదలు పెట్టారని.. 71 ఏళ్ల చరిత్రలో రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయని.. కానీ గట్టిగా నిలబడిన పార్టీ టీఆర్‌ఎస్ ఒక్కటేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ఇద్దరు వ్యక్తులేనని.. ఒకరు ఎన్టీఆర్...మరొకరు కేసీఆర్ అని అన్నారు.
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు వేరని, కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ పరిస్థితులు వేరని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ శూన్యత ఉందని దీనికి తోడు ఆయన సినిమా స్టార్ కావడంతో...అప్పట్లో ఎన్నో అనుకూలతలు ఉన్నాయన్నారు. కానీ కేసీఆర్‌కు ఎలాంటి అనుకూలతలు లేవని కేటీఆర్ తెలిపారు. ఎత్తిన జెండాను దించితే రాళ్లతో కొట్టండని ఆనాడు కేసీఆర్ చెప్పారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలినాళ్లలో అన్నీ ప్రతికూల పరిస్థితులే ఏర్పడ్డాయని కేటీఆర్ అన్నారు. 2001 నుంచి 2019 వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామని తెలిపారు. తెలంగాణలో 16 లోక్‌సభ స్థానాలను టీఆర్ఆర్ కైవసం చేసుకుంటుందని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే గెలుపని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున.. పార్టీ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నామని పార్టీ నేతలతో అన్నారు. పార్టీలో కొత్త, పాతవారికి అవకాశాలు కల్పిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.



