టీడీపీకి షాక్..మనీ లాండరింగ్ కేసులో సుజనా

ఎన్నికలకు ముందు ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి షాక్. సుజనా గ్రూప్ కంపెనీలు మనీ లాండరింగ్ లో ఉన్నాయని ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) గుర్తించింది. అంతే కాకుండా బ్యాంకుల నుంచి తీసుకున్న వందలాది కోట్ల రూపాయల రుణాలను షెల్ కంపెనీల ద్వారా ఇతర కంపెనీలకు తరలించినట్లు నిర్ధారించుకుంది. ఈ పరిణామం టీడీపీ కలకలంల రేపుతోంది. ఓ వైపు ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు చేస్తున్న సమయంలో టీడీపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, ఎంపీపై తీవ్రమైన ఆరోపణలు రావటంతో టీడీపీ ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. సుజనా గ్రూపు కంపెనీ బెస్ట్ అండ్ కాంప్ట్రన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీఈపీఎల్)పై నమోదైన మనీ లాండరింగ్ కేసులో హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్స్ కు చెందిన రూ.315 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను జప్తు చేసినట్లు మంగళవారం ఈడీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. సుజనా గ్రూపు.. మహల్ హోటల్స్ పేరిట ఒక డొల్ల కంపెనీని సృష్టించి తీసుకున్న రుణం మొత్తాన్ని దొంగ లావాదేవీల రూపంలో వైస్రాయ్ హోటల్స్ కు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. వైస్రాయ్ హోటల్స్, మహల్ హోటల్స్ మధ్య వ్యాపార లావాదేవీలు జరిగినట్లుగా ఒప్పందాలు కుదుర్చుకొని ఈ మొత్తాన్ని వైస్రాయ్ హోటల్స్ కు చేరవేశారు. రూ.315 కోట్లు మహల్ హోటల్స్ నుంచి వచ్చినట్లు విచారణలో వైస్రాయ్ హోటల్స్ అంగీకరించిందని ఈడీ వెల్లడించింది.
సుజనా కంపెనీల గోల్ మాల్ లావాదేవీలు భారీ ఎత్తున ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈడీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగటంతో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బీసీఈపీఎల్ రూ.364 కోట్ల విలువైన రుణాలు తీసుకొని ఎగ్గొట్టిందంటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులతో కలసి బెంగళూరులో ఫిర్యాదు చేసింది. దీంతో 2010–2013 కాలంలో ఈ సంస్థ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టినట్లుగా.. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. తర్వాత చెన్నయ్ , న్యూఢిల్లీ, హైదరాబాద్‌ల్లో ఉన్న సుజనా గ్రూపునకు చెదిన కంపెనీలు, నివాసాల్లో చేసిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని సుజనా కార్యాలయంలో చేసిన సోదాల్లో వివిధ డొల్ల కంపెనీలకు చెందిన 124 రబ్బరు స్టాంపులు దొరికాయి. అలాగే బీసీఈపీఎల్‌కు చెందిన రబ్బరు స్టాంపుతో పాటు, ఈ రుణం ద్వారా లబ్ధిపొందిన కంపెనీలు, వివిధ రుణదాతలు, వ్యాపార సంస్థలకు చెందిన రబ్బరు స్టాంపులు దొరికాయి సుజనాచౌదరి పెద్దమొత్తంలో తీసుకున్న రుణాలు ఎక్కడికి తరలించారు? ఎవరు లబ్ధి పొందారు అనేది ఈడీ తదుపరి విచారణలో తేలాల్సి ఉందని చెబుతున్నారు.