ఇంటర్ విద్యార్ధినిపై పోలీసుల దౌర్జన్యం

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం సోమవారం నాడు కూడా రణరంగంగా మారింది. విద్యార్ధి సంఘాలు..రాజకీయ పార్టీలకు చెందిన నేతలు బోర్డు వైఫల్యాలను నిరసిస్తూ నిరసన ప్రదర్శనలకు దిగారు. బోర్డు నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన విద్యార్ధుల ప్రాణాలకు ఎవరు జవాబుదారి అని విద్యార్ధి సంఘాలు ప్రశ్నించాయి. కేవలం బోర్డు నిర్లక్ష్యం కారణంగానే వేలాది మంది విద్యార్ధులు తీవ్ర గందరగోళ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని..ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎన్నడూలేదని విమర్శించారు. బోర్డు కార్యాలయం వద్ద ధర్నాలకు దిగిన విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితోపాటు మరి కొంత మంది నేతలు కూడా బోర్డు ధగ్గర ధర్నా నిర్వహించారు.
వీళ్ళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే బోర్డు అధికారులతో మాట్లాడాలని కోరిన ఓ విద్యార్థినిపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. పదుల సంఖ్యలో పోలీసులు ఆమెను బలవంతంగా అక్కడి నుంచి లాక్కునివెళ్లి అరెస్ట్ చేశారు. దీనిని అడ్డుకున్న విద్యార్థిని ఇద్దరు సోదరులను, తల్లిని కూడా పోలీసులు దారుణంగా ఈడ్చుకెళ్లారు. పోలీసుల తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలపై ఇంటర్ బోర్డ్ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అధికారులు ఇంటర్ బోర్డ్ కార్యాలయానికి తాళాలు వేశారు. విద్యార్థులు ఆందోళనల నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.



