టైగర్ కెసీఆర్ లో రామోజీరావు పాత్ర..వర్మ సంచలన ప్రకటన

రామ్ గోపాల్ వర్మ. వివాదాలు ఆయన వెన్నంటే ఉంటాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో తెలుగుదేశం శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వర్మ...ఇప్పుడు మరోసారి వివాదాలకు సిద్ధం అవుతున్నట్లు కన్పిస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఇప్పటి వరకూ ఏ సినిమా దర్శకుడు చేయని సాహసం చేశారు. అదేంటి అంటే..ఓ అగ్రశ్రేణి పత్రిక ఛైర్మన్ ను డైరక్ట్ గా ఎటాక్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ చేయబోతున్నట్లు కన్పిస్తోంది. ఎందుకంటే టైగర్ కెసీఆర్ సినిమాలో ఎవరెవరి పాత్రలు ఉండబోతున్నాయో వర్మ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అందులో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు పేరు కూడా ఉంది.
వర్మ ప్రకటించిన జాబితాలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, వైఎస్సార్, వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, లోకేష్ తదితర పాత్రలు ఉండబోతున్నాయని తెలిపారు. వర్మ ప్రస్తుతం కెసీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించే పనిలోబిజీగా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితచరిత్ర ఆధారంగా ఓ బయోపిక్‌ను రూపొందించనున్నారు. ఈ సినిమాకు 'టైగర్ కేసీఆర్' అనే టైటిల్ ను తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రామోజీరావు పాత్రను వర్మ ఎలా చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారనుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పలు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.