Telugu Gateway
Politics

మోడీ సర్కారుకు ‘సుప్రీం షాక్’

మోడీ సర్కారుకు ‘సుప్రీం షాక్’
X

సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలోని మోడీ సర్కారుకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి దాఖలైన రివ్యూ పిటీషన్ల విచారిస్తామని తేల్చిచెప్పింది. అయితే కేసులో మెరిట్ ఆధారంగానే ఇది ఉంటుందని పేర్కొంది. రివ్యూ పిటీషన్ పై కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. రాఫేల్‌ ఒప్పంద పత్రాలను తస్కరించారన్న కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చుతూ తీర్పును వెలువరించింది. రఫేల్‌ ఒప్పందంలో విచారణ చేపట్టాల్సిన అంశాలేమీ లేవని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ విపక్షాలు సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ప్రశాంత్ భూషణ్, అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హాలు ఈ పిటీషన్ దాఖలు చేశారు. అయితే రివ్యూ పిటిషన్ల విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు త్వరలో విచారణ తేదీని నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పు తర్వాత పలు కీలక పత్రాలు బహిర్గతం కావటం...అందులో కొన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘హిందూ’లో ప్రచురితం అయిన విషయం తెలిసిందే. కేంద్రం రక్షణ శాఖలో కొన్ని పత్రాలు చోరీ అయ్యాయని కోర్టు తెలిపి...ఆ తర్వాత అదేమీ లేదని మాట మార్చింది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు నిర్ణయం అత్యంత కీలకంగా మారనుంది.

Next Story
Share it