Telugu Gateway
Politics

వారణాసిలో ‘బిగ్ ఫైట్’ తప్పదా?!

వారణాసిలో ‘బిగ్ ఫైట్’ తప్పదా?!
X

దేశంలో ఇప్పుడు అందరి చూపు వారణాసి వైపే. ఎందుకంటే అక్కడ నుంచే రెండవ సారి గెలిచి ప్రధాని పదవి చేపట్టడానికి నరేంద్రమోడీ రెడీ అయిపోతున్నారు. అయితే ఈ వారణాసి పోరు అత్యంత ఆసక్తికరంగా మారబోతోందా?. అంటే ఔననే అన్పిస్తోంది. తాజా పరిణామాలు వారణాసి లో ‘బిగ్ ఫైట్’ రంగం సిద్ధం అవుతున్నట్లు కన్పిస్తోంది. రాహుల్ ఆదేశిస్తే తాను వారణాసి నుంచి బరిలో నిలిచేందుకు రెడీ అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఈ ప్రకటన అత్యంత ఆసక్తికరంగా మారింది. గత కొంత కాలంగా ఈ ప్రచారం ఉన్నా..ఆమె ఈ విషయాన్ని నేరుగా ప్రకటించటం ఇదే మొదటిసారి. ఎలాగైనా మోడీని గద్దె దించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ దేశంలోని పలు పార్టీలతో కలసి ముందుకు సాగుతోంది. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ప్రియాంక తాను మోడీపై పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రియాంక కాంగ్రెస్ తరపున ఉత్తరప్రదేశ్ లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ప్రియాంక మోడీపై పోటీకి సై అని బహిరంగంగా ప్రకటించారు అంటే ఆమె బరిలోకి దిగటం ఖాయమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రియాంక నిజంగా అక్కడ నుంచి బరిలో నిలిస్తే ‘ఫోకస్’ అంతా అటువైపే మళ్ళుతుంది. మోడీ కూడా ఈ నియోజకవర్గంపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అత్యంత కీలకమైన ఈ నియోజకవర్గంలో యూపీలో జట్టు కట్టిన ఎస్పీ, బిఎస్పీలు కూడా ఇంత వరకూ అభ్యర్ధిని ప్రకటించలేదు. ప్రియాంక బరిలో దిగితే ఆ పార్టీలు కూడా ప్రియాంకకు మద్దతు ఇవ్వటం ఖాయంగా కన్పిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన అభ్యర్ధి అజయ్ రాయ్ మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ మోడీపై పోటీ చేసి రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు ప్రియాంక అభ్యర్ధిత్వం ఖరారు అయితే ‘వారణాసి’ దేశంలోనే అత్యంత హాట్ హాట్ సీటుగా మారిపోవటం ఖాయం. వేచిచూడాల్సిందే..అక్కడ ఏమి జరుగుతందో.

Next Story
Share it