Telugu Gateway
Politics

చంద్రబాబు సైకిల్ కు ‘పవన్ పంక్చర్’!

చంద్రబాబు సైకిల్ కు ‘పవన్ పంక్చర్’!
X

పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దారుణంగా దెబ్బతీయనుందా?. కేవలం జనసేన కారణంగా అధికార టీడీపీ ఏకంగా 20 నుంచి 25 సీట్లలో మూడవ స్థానానికి పరిమితం కావాల్సి వస్తుందా?. అంటే ఔననే చెబుతున్నాయి టీడీపీ వర్గాలు కూడా. జనసేన, వామపక్షాలు విడిగా పోటీ చేయటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు లాభం చేకూరుతుందని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలుత ‘లెక్కలు’ వేసుకున్నారు. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత తేలుతున్న అసలు లెక్కల్లో మాత్రం పవన్ కళ్యాణ్ దెబ్బ టీడీపీకి బాగానే తగిలినట్లు కన్పిస్తోందని చెబుతున్నారు. జనసేన ప్రభావం ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో అక్కడక్కడా స్పష్టంగా కన్పిస్తోందని టీడీపీ ప్రముఖులు అంచనాకు వస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలే అత్యంత కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది.

జనసేన ఒంటరి పోరుతో గోదావరి జిల్లాల్లో టీడీపీకి దారుణమైనన దెబ్బ తగలబోతోందని తేలింది. పవన్ పార్టీకి ఉభయ గోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో తక్కువలో తక్కువ ఐదు వేల నుంచి గరిష్టంగా కొన్ని చోట్ల 25 వేల వరకూ ఓటు బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చినందున ఆ ఓట్లు అన్నీ అప్పట్లో టీడీపీ ఖాతాలోకే వెళ్ళాయి. ఈ సారి పొత్తు లేకపోయినా కూడా టీడీపీ-జనసేనల మధ్య ‘రహస్య ఒప్పందం’ ఉందనే విషయాన్ని విఫక్ష వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళకలిగింది. దీంతో గోదావరి జిల్లాల్లోని కీలక సామాజిక వర్గం నేతలు..కార్యకర్తలు కూడా మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తారేమో అన్న కారణంతో చాలా వరకూ జగన్ వైపు మళ్ళారని విశ్లేషిస్తున్నారు.

ఆ బలమైన సామాజిక వర్గం వారు 50 శాతం మంది జనసేన వైపు మళ్ళగా.. సుమారు30 శాతం మంది వైసీపీవైపు, 20 శాతం వరకూ టీడీపీ వైపు మొగ్గుచూపారని ఓ అంచనా. దీని వల్ల గత ఎన్నికల్లో టీడీపీకి కలిసొచ్చిన ఓటు బ్యాంక్ కు భారీ గండిపడగా, వైసీపీకి అదనంగా 30 శాతం మేర ఓట్లు కలిసొచ్చినట్లు అయిందని చెబుతున్నారు. దీనికి తోడు ఉభయ గోదావరి జిల్లాల్లో రైతు రుణ మాఫీ సక్రమంగా అమలు చేయకపోవటంతో పాటు..టీడీపీ నేతల ఇసుక దోపిడీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ లెక్కలు అన్నీ చూస్తుంటే గత ఎన్నికల్లో గెలిపించిన గోదావరి జిల్లాలే ఈ సారి చంద్రబాబును ఇంటికి పంపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it