నిఖిల్ ‘సినిమాకు కష్టాలు’
యువ హీరో నిఖిల్ సినిమాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా నిత్యం ఏదో కారణంతో సమస్యల్లో పడుతోంది. నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమా పేరును తొలుత ‘ముద్ర’గా అనుకున్నారు. కానీ టైటిల్ వివాదంతో సినిమా పేరును ‘అర్జున్ సురవరం’గా మార్చారు. ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్ర పోషించారు. వాస్తవానికి ఈ సినిమా మే1న విడుదల కావాల్సి ఉంది. కానీ పలు సినిమాల ఒత్తిడి ఉండటంతో పాటు..ముఖ్యంగా మల్టీప్లెక్స్ లు అందుబాటులో లేకపోవటంతో మహేష్ బాబు సినిమా ‘మహర్షి’ విడుదల తర్వాతే ఈ సినిమా విడుదల చేయాలని నిర్ణయించారు. మహర్షి మే 9న విడుదల కానున్న విషయం తెలిసిందే.
ట్రైలర్ రిలీజ్‌తో పాటు సినిమా రిలీజ్‌ను కూడా వాయిదా వేసినట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న మజిలీ, చిత్ర లహరి, జెర్సీ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుండటం, అవెంజర్స్ ఎండ్ గేమ్ కూడా భారీ వసూళ్లు సాధిస్తుందన్న టాక్ వినిపిస్తుండటంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ అధికారికంగా వెల్లడించారు.