Telugu Gateway
Politics

లోకేష్ టీమ్ నాలుగు రోజుల దావోస్ ఖర్చు 16 కోట్లు

లోకేష్ టీమ్ నాలుగు రోజుల దావోస్ ఖర్చు 16 కోట్లు
X

నాలుగు రోజుల పర్యటన. ఖర్చు 16 కోట్లు. పలు రాష్ట్రాలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి కానీ..ఖర్చులో ఎవరూ ఏపీకి సాటి రారు అనేలా ఉంది లోకేష్ టీమ్ చేసిన వ్యయం. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ల దృష్టిలో ఏపీ చాలా కష్టాల్లో ఉంది కదా?. అయినా సరే కష్టాల్లోనూ భారీగా ఖర్చు పెట్టడానికి లోకేష్ బాగానే ‘కష్టపడినట్లు’ కన్పిస్తోంది. ఇదంతా ఎక్కడ అంటారా?. ఈ ఏడాది జనవరిలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యుఈఎఫ్) సదస్సు ఖర్చు వివరాలు ఇవి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ దావోస్ సదస్సు కోసం 1.58 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ రాష్ట్రంలో పెద్ద గగ్గోలు పెట్టారు. అందులో భాగంగానే అవినీతి వ్యతిరేక పోరాట కార్యకర్త అజయ్ దుబే సమాచార హక్కు చట్టం ద్వారా ఈ ఖర్చుల వివరాలు కావాలని దరఖాస్తు చేశారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాధ్ ఖర్చును సమర్ధించుకునేందుకు వీలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఖర్చు వివరాలను కూడా బహిర్గతం చేసింది.

దేశంలోనే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల కోసం ఏపీ గరిష్టంగా 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఆ తర్వాత స్థానంలో మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఉంది. ఈ రాష్ట్రం చేసిన ఖర్చు 9 కోట్ల రూపాయలతో రెండవ స్థానంలో ఉంది. మహారాష్ట్ర మాత్రం 7.63 కోట్ల రూపాయల వ్యయం చేసింది. అంత గొడవ జరిగిన మధ్యప్రదేశ్ లో ఆ సర్కారు పెట్టిన ఖర్చు మాత్రం 1.58 కోట్ల రూపాయలే. దావోస్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కావాల్సి ఉన్నా..ఎన్నికల హడావుడి ప్రారంభం కావటంతో ఆయన తనయుడు,మంత్రి నారా లోకేష్ పదకొండు మంది సభ్యులతో కలసి దావోస్ వెళ్ళారు. తెలంగాణ తరపున అధికారుల బృందం వెళ్లింది. ఖర్చు మాత్రం తొమ్మిది కోట్ల రూపాయలు అయింది. పోనీ నారా లోకేష్ టీమ్ దావోస్ సదస్సుకు వెళ్ళి పెట్టుబడులు సాధించింది ఏమైనా ఉందా అంటే అదీ ఉండదు. విచిత్రంగా అక్కడకు వెళ్ళిన ప్రతిసారి అక్కడ పెట్టిన ఏపీ వంటకాల గురించి ప్రచారం చేస్తారే తప్ప..అసలు ఏమి సాధించారో మాత్రం చెప్పరు.

దావోస్ సదస్సుల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు రాకపోయినా అత్యధిక మొత్తాల్లో డబ్బులు చెల్లించి ఆహ్వానాలు కొనుగోలు చేసి వెళ్ళటం వల్లే ఇంత భారీ వ్యయం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ఖర్చును చూస్తే ఆ సంగతి స్పష్టంగా కనపడుతోంది. నిత్యం కష్టాల్లో ఉన్న ఏపీని గాడిన పెట్టేందుకు ఎంతో కష్టపడుతున్నట్లు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఎంత పొదుపుచేస్తున్నారో ఈ దావోస్ ఖర్చు చూస్తేనే తెలిసిపోతుంది. ‘మధ్యప్రదేశ్’ అవినీతి వ్యతిరేక కార్యకర్త ఆర్టీఐ దరఖాస్తు వివరాలతో కూడిన కథనాన్ని ‘ది పయనీర్’ పత్రిక ప్రచురించింది. విచిత్రం ఏమిటంటే ఈ ఐదేళ్ళలో చంద్రబాబునాయుడు దావోస్ సదస్సులపై పెట్టిన ఖర్చుతో ఓ చిన్నసైజు ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it