Telugu Gateway
Politics

ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణీ..దేవాన్ష్

ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణీ..దేవాన్ష్
X

ఎన్నికల ప్రచారంలోకి తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కుటుంబ సభ్యులు అందరినీ రంగంలోకి దింపారు. నారా భువనేశ్వరి ఏకంగా చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తూ స్వయంగా ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నారా బ్రాహ్మణీ, నారా దేవాన్స్ కూడా రంగంలోకి దిగారు. ఆదివారం నాడు నందిగామలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నారా బ్రాహ్మణీతోపాటు దేవాన్స్ కూడా పాల్గొన్నారు. టీడీపీ జెండా పట్టుకుని దేవాన్ష్ ఎన్నికల సభలో కూర్చున్నారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ దేవాన్ష్ ఒక్కరే తన మనవడు కాదని..రాష్ట్రంలోని చిన్నారులంతా తన మనవలు..మనవరాళ్ళే అని వ్యాఖ్యానించారు. అందుకే తాను పిల్లల చదువుకు ఏటా 18 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్దులను ఇంజనీర్లు, డాక్టర్లు చేసే బాధ్యత తనదే అన్నారు. ప్రతి రోజూ తాను బయటకు వెళుతుంటే ఎక్కడికి అని దేవాన్ష్ అడుగుతున్నాడని..తన కష్టం తెలియజేయాలనే సభకు తీసుకొచ్చానని వ్యాఖ్యానించారు.

ఈ సభలో చంద్రబాబు మరోసారి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. వృద్ధులకు..పేదలకు అండగా ఉంటామన్నారు. త్వరలోనే ఫించన్లను మూడు వేల రూపాయలకు పెంచుతామని తెలిపారు. రాజధాని వల్లే కృష్ణా జిల్లాలో భూముల విలువ పెరిగిందని తెలిపారు. విదేశాల్లో విద్య కోసం వెళ్ళేవారికి 20 లక్షల రూపాయలు, ఇంటర్ విద్యార్ధులకు ల్యాప్ టాప్ లు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. జగన్ గతంలో తాను ఎంబీఏ చదివానని చెప్పారని..ఇఫ్పుడు బీకాం అంటున్నారని విమర్శించారు. నరేంద్రమోడీ కూడా ఏ యూనివర్శిటీలో చదివారో తెలియదన్నారు. తాను మాత్రం ఎస్వీ యూనివర్శిటీలో చదవానని అన్నారు. జగన్, కెసీఆర్ , మోడీలు కలసి ఏపీపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో 20 హైదరాబాద్ లు అభివృద్ధి చేస్తానని తెలిపారు.

Next Story
Share it