Telugu Gateway
Politics

మా సీఎస్ ‘మంచోడు’

మా సీఎస్ ‘మంచోడు’
X

ఇదీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కామెంట్. ఏ తప్పు చేయకున్నా ఆయన్ను బదిలీ చేశారంట. కనీసం సీఎంగా ఉన్న ఆయనకు ఒక్క మాట కూడా చెప్పలేదంట. అసలు సీఎస్ ను, ఇంటెలిజెన్స్ చీఫ్ ను బదిలీ చేస్తే సీఎం చంద్రబాబునాయుడు ఎందుకంత గగ్గోలు పెడుతున్నారు?. ఓట్లు ప్రజలు వేస్తారు కానీ..సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్ లే మొత్తం ఓట్లు వేసేస్తారా?. అంటే ఎన్నికల సమయంలో కూడా అధికార యంత్రాంగాన్ని అంతా తన చేతిలో పెట్టుకుని మరోసారి గెలుపు తీరాలకు వెళ్ళాలని చంద్రబాబు అనుకుంటే..ఆ ప్రయత్నాలను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అడ్డుకోవటంతో దీన్ని కూడా సానుభూతికి వాడుకునేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. సీఈసీ ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇఛ్చిన సీఎస్ ఆ మరుసటి రోజే మళ్ళీ ఏ బీ వెంకటేశ్వరరావును నియమిస్తూ ఎలా ఉత్తర్వులు ఇస్తారు?. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తీసుకున్నారా?. చంద్రబాబు చెప్పటంతో వెంటనే జీవో జారీకి ఆదేశాలు ఇచ్చారా?. ఎన్నికల సమయంలో సీఎస్ తో సహా రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుందని సీఎస్ కు తెలియదా?.

అంతే కాదు..సీఈసీ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని సీఎస్ కు ఆదేశించింది ఎవరు?. ఎవరి ఆదేశాలతో ఆయన ఈ చర్యలకు పాల్పడ్డారు?. ఇవి చాలవా కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్ పై వేటు వేయటానికి?. కానీ ఈ అంశాలు అన్నీ మరుగున పడేసి సీఎస్ అనిల్ చంద్రా పునేఠా చాలా మంచోడు అంటూ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు చంద్రబాబు. దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అంటూ గగ్గోలు పెడుతున్నారు?. చంద్రబాబు సాంకేతికంగా ఇప్పుడు ముఖ్యమంత్రే కానీ ఆయనకు ఎలాంటి అధికారాలు ఉండవనే విషయం తెలియదా?. ప్రతి అంశాన్ని కూడా సానుభూతిగా మలుచుకుని ఎన్నికల్లో బయటపడేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు.

Next Story
Share it